Rahul Gandhi: పంజాబ్‌ ఎన్నికల్లో ప్రయోగాలు చేయొద్దు: ఓటర్లకు రాహుల్‌ పిలుపు

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాలు చేయకుండా మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Published : 15 Feb 2022 10:53 IST

 

హోశియార్‌పుర్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాలు చేయకుండా మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. హోశియార్‌పుర్‌లో సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్‌టీ, నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒకరిద్దరు సంపన్నులకే లబ్ధి కలిగిందన్నారు. మోదీ తన ఎన్నికల ర్యాలీల్లో ఎక్కడా నిరుద్యోగం, నల్లధనం సమస్యల గురించి మాట్లాడటమే లేదన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌ సమస్యను అంతం చేస్తామన్నారు. కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌నకు పంజాబ్‌పై ఏమాత్రం అవగాహన లేదన్నారు. చన్నీ సారథ్యంలో ఏర్పడే కాంగ్రెస్‌ సర్కారు సంపన్నుల కోసం కాకుండా పేదలు, రైతుల కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేబుల్, రవాణా రంగాల్లో గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. 

పంజాబ్‌లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవచ్చు: అమరీందర్‌ 

పటియాలా: పంజాబ్‌ ఎన్నికల్లో ఈసారి బహుముఖ పోరువల్ల అన్ని పార్టీలకూ గట్టిపోటీ తప్పదని, ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవచ్చని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన ఆయన భాజపా, ఎస్‌ఏడీ(సంయుక్త్‌) పార్టీలతో కలసి పోటీచేస్తున్నారు. తమ కూటమికే ప్రజల ఆదరణ పెరుగుతోందని ఆయన చెప్పారు. ఆప్, కాంగ్రెస్‌ల గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతోందన్నారు. చాలా పార్టీలకు 10 లేదా 15కు మించి సీట్లు రావని పేర్కొన్నారు. ప్రజలు కులాన్ని కాకుండా సామర్థ్యాన్ని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి చన్నీకి రూ.కోట్లలో ఆదాయం వస్తోందని, అయినా పేద దళితుడిగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి లేదన్నారు.

‘అచ్ఛేదిన్‌’ పాలనను తిరిగి తేవడమే లక్ష్యం: మాయావతి

ఉరయీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ ‘అచ్ఛేదిన్‌’ పాలనను తీసుకురావడమే తమ లక్ష్యమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పేర్కొన్నారు. అందుకోసం 2007లో తాము అధికారంలోకి వచ్చినప్పటి తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో శాయశక్తులను ఒడ్డుతున్నట్లు చెప్పారు. యూపీలో మూడో దశ ఎన్నికలు జరగనున్న జాలౌన్‌ జిల్లాలోని ఉరయీ పట్టణంలో సోమవారం ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ మొదట్నుంచీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల గురించి పట్టించుకోలేదని, అంబేడ్కర్, కాన్షీరాంలను కూడా సరైన రీతిలో గౌరవించలేదని విమర్శించారు. భాజపా, ఎస్పీల పైనా మాయావతి విమర్శలు గుప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని