Corona Virus: 4 వారాలు కేసులు తగ్గితేనే..

దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు నాలుగు వారాలపాటు స్థిరంగా తగ్గితేనే, మహమ్మారి ఎండెమిక్‌గా మారుతున్నట్టు చెప్పవచ్చని ప్రముఖ వైరాలజీ నిపుణుడు, సెంటర్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ ..

Updated : 16 Feb 2022 11:39 IST

కొవిడ్‌ను ఎండెమిక్‌గా పరిగణించడంపై డా.జాకబ్‌ జాన్‌ విశ్లేషణ

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు నాలుగు వారాలపాటు స్థిరంగా తగ్గితేనే, మహమ్మారి ఎండెమిక్‌గా మారుతున్నట్టు చెప్పవచ్చని ప్రముఖ వైరాలజీ నిపుణుడు, సెంటర్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌ డా.టి.జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు. ఈ దశ చాలా నెలలపాటు కొనసాగుతుందని... ఒమిక్రాన్‌లా తీవ్రంగా వ్యాపించి, డెల్టాలా ప్రమాదకరంగా పరిణమించే మరో వేరియంట్‌ పుట్టుకురావడం చాలా అరుదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘జనవరి 21న 3,47,254కు చేరిన రోజువారీ కేసులు ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి. 9 రోజులుగా లక్షకు దిగువనే నమోదవుతున్నాయి. గ్రాఫ్‌లో కేసుల రేఖ పైకి ఎగబాకి, తీవ్రస్థాయికి చేరి, అక్కడి నుంచి దిగువకు పడిపోవడం ఉంటే... దాన్ని ఎపిడెమిక్‌ అంటాం. ఇదే తీరు తరచూ పునరావృతమైతే, ఒక్కో ఉద్ధృతి ఒక్కో దశ అన్న మాట. అలా కాకుండా కేసుల రేఖ అడ్డగీతలా, భారీ హెచ్చుతగ్గులు లేకుండా ఉంటే దాన్ని ఎండెమిక్‌గా పరిగణించవచ్చు. ఒమిక్రాన్‌ కేసులు చాలా వేగంగా తగ్గుతున్నాయి. మరో 4 వారాలు పరిస్థితి ఇలాగే కొనసాగితే మహమ్మారి ఎండెమిక్‌గా మారుతున్నట్టు చెప్పగలం. అప్పుడు కూడా ఒమిక్రాన్‌ కారణంగా ఆసుపత్రులపాలై, ప్రాణాలు కోల్పోయేవారు ఉంటారు. వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో, విస్తృతంగా అందించేవరకూ... ఏడాదికోసారి, లేదంటే కొన్నేళ్లకోసారి కొవిడ్‌ ఉద్ధృతి వచ్చి పోతుంది. కొన్ని నెలల తర్వాత ఒమిక్రాన్‌ మాదిరి ఆశ్చర్యపరిచే మరో వేరియంట్‌ పుట్టుకురావచ్చు’’ అని జాకబ్‌ పేర్కొన్నారు. కాగా- కొవిడ్‌ ఎండెమిక్‌గా మారిందా, లేదా అన్నది సామాన్యులు చూడటం లేదని, సామాజిక-రాజకీయ ఏకాభిప్రాయంతోనే దీన్ని ఎండెమిక్‌గా గుర్తించాల్సి ఉంటుందని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు, ఫౌండేషన్‌ ఫర్‌ పీపుల్‌ సెంట్రిక్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.చంద్రకాంత్‌ లహారియా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని