Ukraine Crisis: ప్రాణాలు కాపాడే బంకర్లు

యుద్ధం మొదలైందంటే సరిహద్దుల్లోని ప్రజల బాధలు వర్ణనాతీతం. ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. 

Updated : 26 Feb 2022 11:22 IST

సరిహద్దు గ్రామాల్లో అనుక్షణం ప్రాణభయం 

కశ్మీర్‌ నుంచి క్రిమియా వరకు ఇదే పరిస్థితి 
జనం భూగర్భ స్థావరాల్లో దాక్కోవలసిందే

యుద్ధం మొదలైందంటే సరిహద్దుల్లోని ప్రజల బాధలు వర్ణనాతీతం. ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. ఎక్కడ బాంబు పడుతుందో ఊహించలేరు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉండే వారికి ఊహలోకి కూడా రాని భయంకరమైన చేదు అనుభవాలివి. ఉక్రెయిన్‌పై ఇప్పుడు రష్యా విరుచుకుపడుతున్న నేపథ్యంలో బాంబు దాడుల నుంచి సామాన్యుల పరిస్థితి ఏమిటనేది అనేది అందరి మనసులనూ తొలిచివేస్తోంది. యుద్ధరంగంలోకి దిగిన దేశాలు పరస్పరం రాకెట్లు, క్షిపణుల దాడులతో విరుచుకుపడుతుంటాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇరు దేశాలు పైకి చెప్పినా చాలా సందర్భాల్లో జనావాస ప్రాంతాల పైనే గురి పెడతాయి. అందుకే శత్రుదేశం దాడులకు తెగబడుతుందన్న సమాచారం తెలిసిన వెంటనే బాధిత దేశాలు ప్రజలను అప్రమత్తం చేస్తాయి. బంకర్లలో తలదాచుకోవాలని సూచిస్తాయి. బాంబు దాడులకు చెక్కు చెదరకుండా, భూగర్భంలో నిర్మించే ఈ నేలమాళిగలు ప్రాణనష్టం తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నిత్యం బాంబు దాడులతో అతలాకుతలమయ్యే ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లోని ప్రజలైతే ఇళ్లలోనే బంకర్లు నిర్మించుకుంటారు.

కశ్మీర్‌ ప్రజలకు అవే రక్ష 

మన దేశంలోనూ సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్‌ నిత్యం కాల్పులతో తెగబడుతుంటుంది. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గినప్పటికీ ఒకప్పుడు కాల్పులు జరపడం, రాకెట్లు ప్రయోగించడం వంటివి నిత్యం జరుగుతూ ఉండేవి. 2016 సర్జికల్‌ దాడులు, 2019 బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలో పాకిస్థాన్‌ సైన్యం పెద్దఎత్తున సరిహద్దులపై విరుచుకుపడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడినవి బంకర్లే. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా వీటిని నిర్మిస్తుంటుంది. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ సరిహద్దుకు అనుకొని ఉన్న ఐదు జిల్లాల్లో 14,460 అత్యాధునిక బంకర్లు నిర్మించడానికి 2017లో పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. 2016లో జరిగిన సర్జికల్‌ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, సరిహద్దుల్లో నిత్యం కాల్పులతో హోరెత్తిపోయిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాల కోసం కేంద్రం భారీగా వీటిని మంజూరు చేసింది. 2020 చివరినాటికి వీటి నిర్మాణం పూర్తయింది. 

సైరన్‌ మోగితే గుండె దడ  

ఒకసారి యుద్ధం మొదలైందంటే క్షణక్షణం భయం భయమే. శత్రుదేశం దాడికి దిగుతుందన్న విషయాన్ని పసిగట్టిన వెంటనే సైన్యం సైరన్‌ మోగిస్తుంది. సాధారణంగా యుద్ధ భయం ఉండే దేశాల సరిహద్దుల్లో అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. వెంటనే ప్రజలంతా ఎక్కడివక్కడ వదిలేసి.. పిల్లలను, వృద్ధులను తీసుకుని సమీపంలోని బంకర్లలోకి వెళ్లిపోతారు. దీనిపై సైన్యమే ప్రజలకు శిక్షణ ఇస్తుంది కూడా. బంకర్లు బాంబు దాడులను తట్టుకునేలా కాంక్రీట్‌తో పకడ్బందీగా నిర్మిస్తారు. భూగర్భంలో ఉండటం వల్ల యుద్ధ విమానాలకు ఇవి కనిపించవు. కొన్ని బంకర్లలో అయితే గరిష్ఠంగా 500 మంది వరకూ కూడా ఉండొచ్చు. వారందరికీ కనీసం వారం పదిరోజులకు సరిపడా ఆహారం ముందుగానే నిల్వలు పెట్టుకుంటారు. బిస్కెట్లు, బ్రెడ్, పాలపొడి వంటివి ఉంటాయి. పంచాయతీల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తుంటారు. 2016 సర్జికల్‌ దాడుల సమయంలో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధులు కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల్లో పర్యటించినప్పుడు అనేకమంది ప్రజలు కుటుంబాలతో సహా బంకర్లలో నివసించటం కనిపించింది. ఆర్‌.ఎస్‌.పురా సెక్టర్‌లోని జేడ్రా అనే గ్రామంపై పాకిస్థాన్‌ బాంబుల వర్షం కురిపించడంతో పదుల సంఖ్యల పశువులు మరణించాయి. బంకర్లలో తలదాచుకోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కాపాడుకోగలిగారు. సాధారణంగా ఇక్కడి ప్రతి ఊళ్లోనూ కేంద్ర ప్రభుత్వమే బంకర్లు నిర్మిస్తుంటుంది. జనాభాను బట్టి గ్రామానికి ఎన్ని బంకర్లు అవసరమో అధికారులు లెక్కకడతారు. డబ్బున్నవారయితే ఎవరికివారు తమ ఇంటికిందనే సొంతంగా నేలమాళిగలు నిర్మించుకుంటుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని