Ukraine Crisis: పుతిన్‌ ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ను ప్రయోగిస్తారా?

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తన వద్ద ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ (ఎఫ్‌ఓఏబీ)ను 

Updated : 27 Feb 2022 11:23 IST

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తన వద్ద ఉన్న శక్తిమంతమైన ఆయుధం ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ (ఎఫ్‌ఓఏబీ)ను బయటకు తీసే వీలుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాన్ని షాక్‌లో ముంచెత్తే వ్యూహంలో భాగంగా దీన్ని ప్రయోగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనుమతిచ్చినట్లు అవి పేర్కొన్నాయి. అణ్వస్త్రం కాకపోయినప్పటికీ ఆ స్థాయి విధ్వంసాన్ని మిగిల్చే ఈ బాంబుపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఏమిటీ బాంబు?

ఎఫ్‌ఓఏబీ అసలు పేరు ‘థర్మోబారిక్‌ బాంబ్‌’. ఇది 44 టన్నుల టీఎన్‌టీతో సమానమైన విస్ఫోటక శక్తిని కలిగి ఉంటుంది. ఫలితంగా 300 మీటర్ల పరిధిలో పెను విధ్వంసాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి అణ్వస్త్ర స్థాయిలో ఈ నష్టం ఉంటుంది. థర్మోబారిక్‌ బాంబును యుద్ధవిమానం నుంచి జారవిడుస్తారు. ఇది లక్ష్యాలను మండించేస్తుంది. ఇందుకోసం గాల్లోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. నేలను తాకేలోగానే గాల్లోనే అది పేలిపోతుంది. ఫలితంగా సూపర్‌సోనిక్‌ ప్రకంపన, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు వెలువడతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని మనుషులు కాలి బూడిదైపోతారు. 

ఎంఓఏబీకి ప్రతిగా..

అమెరికా అభివృద్ధి చేసిన మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ (ఎంఓఏబీ)కు ప్రతిగా రష్యా దీన్ని 2007లో రూపొందించింది. ఎంఓఏబీ కన్నా ఇది నాలుగు రెట్లు శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాంబు 11 టన్నుల టీఎన్‌టీతో సమానమైన పేలుడును సృష్టించగలదు. దీన్ని 2003లో తొలిసారిగా అగ్రరాజ్యం పరీక్షించింది. 2017లో దీన్ని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులపై ప్రయోగించింది. దానివల్ల ఎంతమంది హతమయ్యారన్నది అమెరికా ప్రకటించలేదు. 

చైనా కూడా.. 

ఎంఓఏబీకి ప్రతిగా చైనా కూడా షియాన్‌ హెచ్‌-6కె పేరుతో ఒక బాంబును అభివృద్ధి చేసింది. 2019లో దీన్ని పరీక్షించింది. ఈ బాంబు ఒక సైనిక స్థావరాన్ని పూర్తిగా నాశనం చేయగలదు.    - ఈనాడు ప్రత్యేక విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని