మళ్లీ చక్రం తిప్పుతాయా?: మణిపుర్‌లో కీలకంగా చిన్న పార్టీలు

 ‘పిట్ట కొంచెం - కూత ఘనం’ అన్న సామెత మణిపుర్‌లో చిన్న పార్టీలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది! 

Published : 28 Feb 2022 10:42 IST


 ‘పిట్ట కొంచెం - కూత ఘనం’ అన్న సామెత మణిపుర్‌లో చిన్న పార్టీలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది! రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం స్వల్ప స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) చక్రం తిప్పాయి. భాజపాకు అవసరమైన మద్దతు అందించి, ఔరా అనిపించే స్థాయిలో మంత్రి పదవుల్ని దక్కించుకున్నాయి. ఈ దఫా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. సర్కారు ఏర్పాటులో కింగ్‌మేకర్లుగా అవతరించాలని అవి తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ) 


వంటి పార్టీల పరిస్థితిని పరిశీలిస్తే..
ఎన్‌పీపీ: సొంతంగా గద్దెనెక్కడంపై గురి 

మణిపుర్‌లో 2017 ఎన్నికల్లో ఎన్‌పీపీ కేవలం 9 స్థానాల్లో పోటీ చేసి నాలుగింట జయభేరి మోగించింది. నాటి ఫలితాలిచ్చిన ఊపుతో ప్రస్తుతం 42 చోట్ల అభ్యర్థులను బరిలో దించింది. హిందూ మీటీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని, వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)తో పాటు 2019 నాటి పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయిస్తామని మేనిఫెస్టోలో భారీగా హామీలిచ్చింది. పలు స్థానాల్లో భాజపా విజయావకాశాలను ఈ పార్టీ భారీగా దెబ్బతీసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమలదళం, ఎన్‌పీఎఫ్‌లకు ముష్కర సంస్థల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయంటూ ఎన్‌పీపీ నేతలు ప్రచారంలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2020లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ద్వారా భాజపాకు ఎన్‌పీపీ షాకిచ్చింది. తర్వాత మళ్లీ నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వంలో కొనసాగింది. ఈ దఫా రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి వస్తామని ఎన్‌పీపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

ఎన్‌పీఎఫ్‌: పట్టున్న స్థానాల్లోనే పోటీ 

 కొండప్రాంత జిల్లాల్లో నాగాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఎన్‌పీఎఫ్‌కు మంచి పట్టుంది. దీంతో- అలాంటి 10 స్థానాలను ఎంచుకొని ప్రస్తుతం వాటిలోనే ఎన్నికల బరిలో దిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి ఈ పార్టీకి గట్టి సవాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎన్‌పీపీతో పోలిస్తే మెరుగైన మిత్రపక్షంగా ఎన్‌పీఎఫ్‌ను భాజపా భావిస్తోంది. ఈ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో కమలదళం ఉద్దేశపూర్వకంగా బలహీన అభ్యర్థులను బరిలో దింపిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

* తాజా ఎన్నికల్లో 38 స్థానాల్లో పోటీచేస్తున్న జనతాదళ్‌ (యునైటెడ్‌) కూడా మెరుగైన ఫలితాలపై గురిపెట్టింది. కాంగ్రెస్, భాజపాల నుంచి ఇద్దరేసి చొప్పున ప్రముఖ నేతలు ఇటీవల ఆ పార్టీలో చేరారు. మణిపుర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల స్థితిలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి తాము మద్దతిస్తామని రాష్ట్ర జేడీయూ ప్రధాన కార్యదర్శి ఇటీవల స్పష్టం చేశారు. మరోవైపు- సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, జేడీఎస్‌.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన ‘మణిపుర్‌ ప్రగతిశీల లౌకికవాద కూటమి (ఎంపీఎస్‌ఏ)’లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

నాటి పరిణామాలతో.. 

మణిపుర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28 సీట్లు గెల్చుకుంది. భాజపాకు 21 స్థానాలు దక్కాయి. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌ చెరో నాలుగు స్థానాలు గెల్చుకున్నాయి. ఎల్‌జేపీ ఓ సీటును దక్కించుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓ నియోజకవర్గంలో, స్వతంత్ర అభ్యర్థి మరోచోట విజయం సాధించారు. అయితే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను నాడు గవర్నర్‌ ఆహ్వానించారు. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎల్‌జేపీ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కమలదళం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. నాడు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు నలుగురూ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. ఎన్‌పీఎఫ్‌కు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఎల్‌జేపీ ఎమ్మెల్యేను కూడా మంత్రి పదవి వరించింది. నాటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీలకు ప్రాధాన్యం పెరిగింది.  - ఈనాడు ప్రత్యేక విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని