Up Elections 2022: ఈ అఖిలేశ్‌ యాదవ్‌లు గెలిస్తే అసెంబ్లీలో తికమకే!

అఖిలేశ్‌ యాదవ్‌.. ఈ పేరు వింటే దాదాపుగా అందరికీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేతే గుర్తుకొస్తారు! అయితే దేశవ్యాప్తంగా

Updated : 01 Mar 2022 12:29 IST

యూపీ ఎన్నికల బరిలో ఎస్పీ అధినేత పేరుతో మరో ముగ్గురు 

లఖ్‌నవూ: అఖిలేశ్‌ యాదవ్‌.. ఈ పేరు వింటే దాదాపుగా అందరికీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేతే గుర్తుకొస్తారు! అయితే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం నలుగురు అఖిలేశ్‌ యాదవ్‌లు బరిలో ఉన్నారు. ఎస్పీ అధ్యక్షుడు కర్హల్‌లో పోటీ చేస్తుండగా.. మిగిలిన ముగ్గురు బీకాపుర్, గున్నౌర్, ముబారక్‌పుర్‌ల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముబారక్‌పుర్‌ బరిలో ఉన్న అఖిలేశ్‌ కూడా ఎస్పీ అభ్యర్థే కావడం విశేషం. గత ఎన్నికల్లో ఆయన 688 ఓట్ల స్వల్ప తేడాతో బీఎస్పీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ దఫా విజయంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎస్పీ అధినేత అఖిలేశ్‌ సీఎం అవుతారు. మా ఎమ్మెల్యేగా కూడా అఖిలేశే ఉంటారు’’ అని నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు చెప్పుకొంటున్నారని ముబారక్‌పుర్‌ అభ్యర్థిగా ఉన్న అఖిలేశ్‌ తెలిపారు. ముబారక్‌పుర్‌లో తమ అభ్యర్థిగా ‘అఖిలేశ్‌ యాదవ్‌’ను ఎస్పీ ప్రకటించడంతో.. పార్టీ అధినేతే అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తొలుత ఊహాగానాలు రావడం గమనార్హం. 

బీకాపుర్‌ బరిలో ఉన్న అఖిలేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి. 2016లో ఎస్పీని వీడి ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుందని ఇక్కడి అఖిలేశ్‌ వివరిస్తూ.. ‘‘కొన్ని రోజుల క్రితం నేను ప్రచారం నిర్వహిస్తుండగా.. నా మద్దతుదారుల్లో ఒకరు ‘అఖిలేశ్‌ భయ్యా జిందాబాద్‌’ అని గట్టిగా అరిచారు. అది వినిపించగానే.. అక్కడికి సమీపంలోనే ఉన్న ఎస్పీ కార్యకర్తలు కూడా ‘అఖిలేశ్‌ భయ్యా జిందాబాద్‌’ చాలాసేపు నినాదాలు చేశారు. ఆపై తాము అంతవరకు జిందాబాద్‌ అన్నది ఎస్పీ అధినేత గురించి కాదని తెలుసుకొని నాలుక కరుచుకున్నారు’’ అని పేర్కొన్నారు. ఇక మరో అఖిలేశ్‌ యాదవ్‌.. గున్నౌర్‌లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. నిజానికి ఈయన డమ్మీ అభ్యర్థి. ఈయన తండ్రి రామ్‌ఖిలాడీ సింగ్‌ ఇక్కడ ఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. నామినేషన్ల పరిశీలనలో ఏమైనా ఇబ్బందులు తలెత్తి రామ్‌ఖిలాడీ అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైతే పోటీ చేసేందుకు వీలుగా అఖిలేశ్‌ కూడా నామినేషన్‌ వేశారు. ఈ నలుగురు అఖిలేశ్‌ల్లో ఎంతమంది గెలుస్తారన్నది ఈ నెల 10న తేలిపోనుంది. ఒకవేళ వీరంతా గెలిస్తే మాత్రం.. ‘అఖిలేశ్‌ యాదవ్‌’ పేరుతో యూపీ అసెంబ్లీ తికమకపడటం ఖాయం! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని