Moon: చందమామా! కాచుకో..రేపు జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్‌ శకలం

గతంలో ప్రయోగించిన ఒక రాకెట్‌ తాలూకు మూడు టన్నుల బరువైన విడిభాగం మార్చి 4న (శుక్రవారం) గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుణ్ని ఢీకొనబోతోంది. ఈ ఘటన చంద్రునికి

Updated : 03 Mar 2022 12:18 IST

కేప్‌ కెనవెరాల్‌ (అమెరికా): గతంలో ప్రయోగించిన ఒక రాకెట్‌ తాలూకు మూడు టన్నుల బరువైన విడిభాగం మార్చి 4న (శుక్రవారం) గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుణ్ని ఢీకొనబోతోంది. ఈ ఘటన చంద్రునికి వెనుకవైపు జరగనుంది. చంద్రుడు భూమికి ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు. రెండోవైపు ఎప్పటికీ కనిపించదు. చీకటిగా ఉండే ఈ రెండోవైపునే పాత రాకెట్లోని మూడో అంచె ఇపుడు పతనం కానుంది. దీన్ని భూమిపై నుంచి టెలిస్కోపులతో చూడలేం. రాకెట్‌ శిథిలభాగం చంద్రుడిని ఢీకొన్నప్పుడు 33 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పు బిలం ఏర్పడుతుందని అంచనా. దీనివల్ల రేగే దుమ్మూధూళి వందల కిలోమీటర్లు పరచుకొంటుంది. ఇది సర్దుకోడానికి వారాలు, నెలలు పడుతుంది కాబట్టి, బిలాన్ని వెంటనే చూడలేం. ఇంతకీ చంద్రుడిని ఢీకొనబోతున్న రాకెట్‌ను ఎవరు ప్రయోగించారనేదానిపై స్పష్టత లేదు.

* భూమి నుంచి గ్రహశకలాలను టెలిస్కోపు ద్వారా గమనిస్తూ ఉండే బిల్‌ గ్రే అనే వ్యక్తి రాకెట్‌ మూడో అంచె చంద్రుడిని ఢీకొనబోతోందని జనవరిలోనే కనిపెట్టారు. మొదట్లో ఆ రాకెట్‌ స్పేస్‌ఎక్స్‌ సంస్థ 2015లో ప్రయోగించిన ఫాల్కన్‌ రాకెట్లోని ఎగువ అంచెగా భావించారు. నెల రోజుల తరవాత ఆ శిథిలభాగం స్పేస్‌ఎక్స్‌ది కాదనీ, 2014లో చైనా ప్రయోగించిన రాకెట్‌ మూడో అంచె కావచ్చని ప్రతిపాదించారు. తమ రాకెట్‌ ఎగువ అంచె భూమికి తిరిగివచ్చి వాతావరణ రాపిడికి దగ్ధమై రాలిపోయిందని చైనా అధికారులు ప్రకటించారు. దీంతో చంద్రుడిని తాకబోతున్న శిథిలం ఏ దేశానికి చెందినదో స్పష్టంగా తెలియడం లేదని అమెరికా అంతరిక్ష కమాండ్‌ మంగళవారం ప్రకటించింది. దిగువ కక్ష్యలోని శిథిలాలపై ఈ కమాండ్‌ నిఘా వేసి ఉంచుతుంది. బిల్‌ గ్రే మాత్రం చంద్రుణ్ని తాకబోతున్న రాకెట్‌ భాగం చైనాదే అని భావిస్తున్నారు. అన్నట్లు.. చైనా 2020లో మరొక రాకెట్‌ను చంద్రుని వద్దకు పంపింది.

* చంద్రుడి మీద వాతావరణం ఉండదు కాబట్టి, అంతరిక్షం నుంచి పడే ఉల్కలు, ఇతర శకలాలను భూమిలా దగ్ధం చేసే సత్తా చంద్రునికి లేదు. అందువల్ల చంద్రుడు ఏర్పడిననాటి నుంచి ఉల్కాపాతాలు, గ్రహశకల పతనాల వల్ల ఏర్పడిన అసంఖ్యాక బిలాలు అలాగే ఉండిపోయాయి. ఈ బిలాల్లో కొన్ని 2,500 కిలోమీటర్ల వెడల్పు కూడా ఉంటాయి. చంద్రునిపై గాలి కూడా ఉండదు కాబట్టి, దుమ్మూధూళి ఆ బిలాలను కప్పలేదు. ప్రస్తుతం చంద్రునిపై చైనా లూనార్‌ ల్యాండర్‌ ఒకటి ఉంది. అమెరికా పంపిన ఓ ఉపగ్రహం చంద్ర కక్ష్యలో తిరుగుతోంది. అలాగే భారత్‌కు చెందిన చంద్రయాన్‌-2 ఉపగ్రహమూ కక్ష్యలో ఉంది. ఈ రోజుల్లో దేశాలతోపాటు స్పేస్‌ఎక్స్‌ వంటి కంపెనీలు కూడా రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. వీటి శిథిలాలను ఆరా తీసే యంత్రాంగమేదీ ఇంకా ఏర్పడలేదు. బిల్‌ గ్రే వంటి ఔత్సాహికులే తీరిక వేళలను అంతరిక్ష పరిశీలనకు వెచ్చిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని