Ukraine Crisis: రెచ్చిపోయిన రష్యా సేనలు

 ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచిన రష్యా... నైపర్‌ నది సమీపంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన నిప్రోపై 

Published : 12 Mar 2022 08:43 IST

ఉక్రెయిన్‌లోని నాలుగో అతిపెద్ద నగరంపై దాడులు 
భద్రతా మండలికి చేరిన ‘ల్యాబ్‌’ పంచాయితీ 

ఎల్వివ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచిన రష్యా... నైపర్‌ నది సమీపంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన నిప్రోపై శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడింది. ఈ ధాటికి ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్‌లో నాలుగో అతిపెద్ద నగరమైన నిప్రోలో దాడులు చోటుచేసుకోవడంతో, మిగతా పట్టణాల్లోని పౌరులు హడలెత్తిపోతున్నారు. తూర్పు, దక్షిణ నగరాల్లోకి జోరుగా దూసుకెళ్లిన పుతిన్‌ సేనలు... కీవ్‌ సహా ఉత్తర ప్రాంతాలపై మాత్రం ఆ దూకుడును ప్రదర్శించలేకపోతున్నాయి. రాజధానిపై పట్టు సాధించడానికి రష్యా బలగాలకు ముచ్చెమటలు తప్పడంలేదు. ఉక్రెయిన్‌ సైనికుల నుంచి వారికి అనూహ్యంగా తీవ్రస్థాయి ప్రతిఘటన ఎదురవుతోందని... ముఖ్యంగా నైతిక, సరఫరా సమస్యలు వెంటాడుతున్నాయని పశ్చిమదేశాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా- మేరియుపొల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై రష్యా వైమానిక దాడిని అమెరికా, దాని మిత్రదేశాలు తీవ్రంగా ఆక్షేపించాయి.

ఆ ప్రయోగశాలలతో ముప్పు ఉందా?

అమెరికా సాయంతో ఉక్రెయిన్‌ తన దేశంలో సైనిక జీవ, రసాయన ప్రయోగశాలలను నిర్వహిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దీన్ని ఇప్పటికే జెలెన్‌స్కీతోపాటు బైడెన్‌ కూడా ఖండించారు. అయితే- రష్యా విజ్ఞప్తి మేరకు ఐరాస భద్రతామండలి ఈ అంశంపై సమీక్ష చేపట్టి, ఈ ల్యాబ్‌ల వల్ల ఎలాంటి ముప్పు ఉందన్నది తేల్చనుంది. ఉక్రెయిన్‌పై రష్యా జీవాయుధాలను ప్రయోగించవచ్చని అమెరికా శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ ఆరోపించిన క్రమంలో, పుతిన్‌ సర్కారు ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

మా సైన్యం కీలక మలుపునకు చేరింది: జెలెన్‌స్కీ

తమ సైనిక బలగాలు ‘వ్యూహాత్మక మలుపు’నకు చేరుకున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కీవ్‌లోని అధ్యక్ష భవనం ముందు తాను మాట్లాడిన వీడియోను ఆయన తాజాగా విడుదల చేశారు. ‘‘మా దేశం విముక్తి పొందడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో తెలియదు. కానీ, అది కచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మా సైనిక బలగాలు వ్యూహాత్మక మలుపును చేరుకున్నాయి’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌... బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో శుక్రవారం మంతనాలు సాగించారు. ఉక్రెయిన్‌తో దాదాపు ప్రతిరోజూ చర్చలు జరుపుతున్నామని, కొంత సానుకూల పురోగతి కనిపిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

రష్యాపై ఆంక్షలు సరికాదు: చైనా ప్రధాని 

బీజింగ్‌: ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ మరింత తీవ్రంగా క్షీణిస్తున్నాయని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ తీవ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, ఆ దేశం నాటోలో చేరడం వల్ల రష్యాకు ఎదురయ్యే ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకూ; అభివృద్ధి, సుస్థిరతల సాధనకూ కృషి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. అమెరికా, ఐరోపా సమాఖ్యలు రష్యాపై ఆంక్షలు విధించడం సరికాదని; కొవిడ్‌-19 నుంచి కోలుకోవాల్సిన తరుణంలో ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతాయని లీ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని