Andhra Pradesh News: పెండింగ్‌ బిల్లులకు మోక్షమేదీ?

రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కరోనా వేళ రోగులకు ఆహారం సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టరు నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టులు 

Updated : 12 Mar 2022 10:21 IST

బడ్జెట్‌లో కనీస ప్రస్తావనా శూన్యం 
రూ.లక్ష కోట్ల బిల్లులు  చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కరోనా వేళ రోగులకు ఆహారం సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టరు నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న బడా గుత్తేదార్ల వరకు పెండింగ్‌ బిల్లులు అందకపోవడమే ప్రధాన సమస్య. పాత బిల్లులు చెల్లింపులకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించిన దాఖలాలు ఈ బడ్జెట్‌లో ఏమీ లేవు. పెండింగ్‌ బిల్లుల విలువ దాదాపు రూ.లక్ష కోట్లు ఉన్నట్లు అనధికారిక సమాచారం. రాష్ట్రంలో దాదాపు 18 వేల హెడ్‌ ఆఫ్‌ అకౌంట్లు ఉన్నాయి. అవి కాకుండా పీడీ ఖాతాల ద్వారా చెల్లించాల్సిన మొత్తాలూ పెద్ద సంఖ్యలో పెండింగు పడినట్లు చెబుతున్నారు. వీటి చెల్లింపులకు బడ్జెట్‌లో  ప్రత్యేక కేటాయింపులు ఉండటం లేదు. అప్పులు చేసి సరకులు సరఫరా చేసినవారు, ఉప గుత్తేదారులుగా చిన్న చిన్న పనులు చేసుకున్నవారు సైతం బిల్లులు అందక.. తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. 

అద్దె బిల్లులు, వాహన బిల్లులదీ అదే దారి

ప్రభుత్వ ఉద్యోగులు.. వారు దాచుకున్న సొమ్ములపై రుణాలు తీసుకునేందుకు సమర్పించిన బిల్లులకు కూడా అతీగతీ లేదు. ఆఖరికి కార్యాలయాల అద్దె బిల్లులు, వాహనాల బిల్లులు కూడా చెల్లించడం లేదు. కొద్ది రోజులుగా ఖజానా తలుపులు మూసివేసి బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిలిపేశారు. పెండింగు బిల్లుల మొత్తాన్ని, అప్పటికే బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులిచ్చినా చెల్లింపులు జరపని వాటిని కొత్త బడ్జెట్‌కు బదిలీ చేయట్లేదు. దీంతో బిల్లుల కోసం ఏటా మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాల్సి వస్తోంది. కాగ్‌ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖ రాస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు లేని ఖర్చు దాదాపు రూ.90 వేల కోట్ల పైన ఉన్నట్లు పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయింపులు చూపి కూడా ఖర్చు చేయని మొత్తాలు రూ.30 వేల కోట్లు దాటాయని ప్రస్తావించింది. ఇవన్నీ బిల్లుల చెల్లింపు విధానంలో ఏర్పడ్డ అసంబద్ధ వైఖరి వల్లే అని ఆర్థికశాఖలో గతంలో పని చేసిన సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. పెండింగు బిల్లులు చెల్లించాలంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి అదనపు బడ్జెట్‌ మంజూరు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

అభివృద్ధిపై ప్రభావం

రాబడులు లేవంటూ ఏళ్ల తరబడి ప్రభుత్వం బిల్లులు పెండింగులో పెడుతుండటం రాష్ట్రాభివృద్ధిపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. చాలామంది గుత్తేదార్లు ఏ పనులు చేయడానికీ ముందుకు రావడం లేదు. టెండర్లలో పాల్గొనాలంటేనే భయపడుతున్నారు. టెండర్లు దక్కించుకున్నవారు చేసిన పనికి బిల్లు వస్తేనే మిగతా పని కొనసాగిద్దామన్నట్లు స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఆఖరికి హైకోర్టు జోక్యం చేసుకుని.. బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరో 9 మంది అధికారులను పిలిచి ప్రశ్నించింది. అయినా కూడా మొత్తం పెండింగు బిల్లులపై ఒక దృక్పథం తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులు దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. న్యాయస్థానానికి వెళ్లిన వారి బిల్లులు ఎంత పెండింగులో ఉన్నాయో సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారని సమాచారం. అంటే వారికి మాత్రమే బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని