Ukraine Crisis: రష్యా నుంచి విదేశీ కంపెనీల నిష్క్రమణ.. భారీగా ఉద్యోగాలు కోల్పోనున్న స్థానికులు

రష్యా రాజధాని మాస్కోలోని ఏడంతస్తుల ఎవ్రోపైస్కై మాల్‌ ఒకప్పుడు విదేశీ వస్తు దుకాణాలతో కళకళలాడేది.

Updated : 13 Mar 2022 10:00 IST

  ఆ సంస్థల వేలం దిశగా పుతిన్‌ చర్యలు?

ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లో రష్యా దాడితో దగ్థమవుతున్న నివాస అపార్ట్‌మెంట్

కీవ్‌: రష్యా రాజధాని మాస్కోలోని ఏడంతస్తుల ఎవ్రోపైస్కై మాల్‌ ఒకప్పుడు విదేశీ వస్తు దుకాణాలతో కళకళలాడేది. లండన్, పారిస్, రోమ్‌ పేర్లతో ఇక్కడున్న విభాగాలు ఖరీదైన వస్తువులను విక్రయించేవి. ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనల యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా... ఈ దుకాణాలన్నీ రెండు వారాలుగా ఖాళీ అవుతున్నాయి. మరెన్నో విదేశీ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. దీంతో వేల మంది రష్యన్లు ఉపాధి కోల్పోనున్నారు. ఇలాంటి కంపెనీలను వేలం వేయడం ద్వారా ఇతర సంస్థలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు పుతిన్‌ సర్కారు కొత్త చట్టం తీసుకురానుంది. దీన్ని ఉపయోగించి... విదేశీ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలను పూర్తిగా, లేదంటే 25% వాటాతో స్వాధీనం చేసుకోనుంది. దీన్ని జాతీయీకరణలో తొలిమెట్టుగా పాలక పార్టీ యునైటెడ్‌ రష్యా తెలిపింది. రష్యా విడచి వెళ్లకుండా వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించే విదేశీ కంపెనీలకు మాత్రం ప్రత్యేక సాయం అందించాలని పుతిన్‌ సర్కారు ప్రతిపాదించింది. రష్యా గనుక విదేశీ సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటే... కోర్టు దావాలకు సిద్ధపడాల్సి వస్తుందని, భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావని అమెరికా అధ్యక్ష భవన ప్రతినిధి జెన్‌ సాకీ హెచ్చరించారు.

2014లోనూ ఆహార దిగుమతులకు విఘాతం్ల్ల్

రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్నప్పుడు పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఆహార దిగుమతులకు విఘాతం కలిగింది. దేశీయ ఆహారోత్పత్తిని పెంచడంతోపాటు... టర్కీ వంటి మిత్రదేశాల నుంచి దిగుమతులను పెంచుతూ పుతిన్‌ సర్కారు చర్యలు తీసుకొంది. ఫ్రెంచి ఆహార సంస్థ దనోన్‌ రష్యాలో కొత్త పెట్టుబడులు పెట్టకపోయినా... స్థానిక సిబ్బంది, సరఫరా గొలుసులతో వ్యాపారం కొనసాగిస్తోంది. విదేశీ కార్ల కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి. ఫ్రెంచి కార్ల కంపెనీ రెనోలో మెజారిటీ వాటాలు రష్యన్‌ సంస్థ ఎవ్టోవాజ్‌కే ఉన్నా, రెనో కూడా తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపేసింది. ఆంక్షల వల్ల దిగుమతులు నిలచిపోయి... ఐకియా వంటి విదేశీ ఫర్నిచర్‌ సంస్థ కూడా రష్యాలో తన దుకాణం సర్దేయక తప్పడం లేదు. మెక్‌ డోనాల్డ్స్, సిగరెట్ల కంపెనీ ఇంపీరియల్‌ బ్రాండ్స్‌ రష్యా కార్యకలాపాలను నిలిపేసినా అక్కడి సిబ్బందికి జీతాలు చెల్లిస్తూనే ఉన్నాయి. ఇలా ఎంతోకాలం నడవదనీ, వేసవి చివరికల్లా రష్యాలో ఉండాలో, నిష్కమ్రించాలో ఆయా కంపెనీలు తేల్చుకోక తప్పదని మాక్రో అడ్వైజరీ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి క్రిస్‌ వీఫర్‌ వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీల ఆస్తులను రష్యా స్వాధీనం చేసుకుంటే- 1917 బోల్షెవిక్‌ విప్లవం నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని, కొత్త పెట్టుబడులు రావని రష్యన్‌ కుబేరుడు వ్లాదిమిర్‌ పొతానిన్‌ వంటివారు హెచ్చరిస్తున్నారు.  

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు