BJP: మణిపుర్‌ సీఎం పీఠంపై భాజపా మౌనం

మణిపుర్‌లో తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న  ఆసక్తి రేకెత్తిస్తోంది. అధికారం కోసం అవసరమైన మెజార్టీని భాజపా ఈ దఫా సొంతంగా దక్కించుకుంది.

Published : 18 Mar 2022 10:56 IST

రేసులో బీరేన్‌సింగ్‌తోపాటు పలువురు నేతలు? 

ఇంఫాల్‌: మణిపుర్‌లో తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న  ఆసక్తి రేకెత్తిస్తోంది. అధికారం కోసం అవసరమైన మెజార్టీని భాజపా ఈ దఫా సొంతంగా దక్కించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తయింది. అయినప్పటికీ కొత్త సీఎం ఎవరన్న సంగతిని భాజపా అధిష్ఠానం తేల్చట్లేదు. గత ఐదేళ్లు సీఎంగా ఉన్న ఎన్‌.బీరేన్‌సింగ్‌ తాజా ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే- ఆయన్ను సీఎం పదవిలో కొనసాగించే విషయంపై కమలదళం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో పలువురు ఇతర నేతలూ రేసులో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి బిశ్వజిత్‌ సింగ్, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు అధికారిమయూప్‌ శారదా దేవి, మాజీ మంత్రి గోవింద్‌దాస్‌ కోంథౌజామ్, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ యమ్నం ఖేమ్‌చంద్‌సింగ్‌ తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి. బీరేన్‌ సింగ్‌ కేబినెట్‌లో ఇన్నాళ్లూ బిశ్వజిత్‌ సింగ్‌ శక్తిమంతమైన మంత్రిగా ఉన్నారు. విద్యుత్తు, ప్రజాపనులు, గ్రామీణాభివృద్ధి, జౌళి, వాణిజ్య-పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. శారదా దేవికి భాజపాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 1995 నుంచి ఆమె పార్టీలో కొనసాగుతున్నారు. గోవింద్‌దాస్‌.. బిష్ణుపుర్‌ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మణిపుర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని