Ukraine Crisis: టన్నుల కొద్దీ కరుణ.. ట్రక్కుల నిండా సాయం

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నాలుగోవారంలోకి అడుగు పెడుతుండగా.. 

Published : 19 Mar 2022 09:39 IST

 యుద్ధ పీడిత పౌరులకు,  శరణార్థులకు స్వచ్ఛంద సంస్థల అండ
 వెల్లువలా వస్తున్న దుప్పట్లు, స్వెటర్లు, సౌరదీపాలు 

జెజౌ (పోలండ్‌): ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నాలుగోవారంలోకి అడుగు పెడుతుండగా.. భారీ సంఖ్యలో శరణార్థులు పొరుగు దేశాలకు వలస పోయారు. వీరికీ, ఉక్రెయిన్‌లో ఉంటూ యుద్ధం వల్ల అష్టకష్టాలు పడుతున్న పౌరులకూ సహాయం అందించడానికి అంతర్జాతీయ సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలోని పోలిష్‌ నగరం జెజౌలో ఐక్యరాజ్యసమితి శరణార్థి సహాయక సంస్థ యు.ఎన్‌.హెచ్‌.సి.ఆర్‌. నిర్వహిస్తున్న గిడ్డంగికి పెద్దఎత్తున దుప్పట్లు, సౌరదీపాలు, స్వెటర్లు, నీళ్ల క్యానులు విరాళంగా వస్తున్నాయి. ప్రైవేటురంగం నుంచి 30 కోట్ల డాలర్ల నగదు, సహాయ సామగ్రి అందాయనీ.. వాటిలో కొంతభాగాన్ని శరణార్థులతోపాటు ఉక్రెయిన్‌ పౌరులకూ అందించామని  యు.ఎన్‌.హెచ్‌.సి.ఆర్‌. ప్రతినిధి మాథ్యూ సాల్ట్‌మార్ష్‌ చెప్పారు. పోలిష్‌ సరిహద్దు సమీపంలోని ఉక్రెయిన్‌ నగరం లువ్యూకు యు.ఎన్‌.హెచ్‌.సి.ఆర్‌. 22 ట్రక్కుల్లో సామగ్రిని పంపి, మరి 10 ట్రక్కులను సిద్ధం చేస్తోంది. లువ్యూలో ఇప్పటికే సహాయ సామగ్రి కొంత పంపిణీ చేశామనీ, వీలు చిక్కగానే రేవు నగరం మరియుపోల్‌కూ పంపుతామని సాల్ట్‌మార్ష్‌ చెప్పారు.

మరియుపోల్‌ నగరంపై ఇప్పటికీ రష్యన్‌ దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ముట్టడిలో ఉన్న ఉక్రెయిన్‌ పట్టణాలు, నగరాల్లో తాగడానికి నీరు లేదు, ఆహారం, విద్యుత్తు లేవు. పిల్లలు ఆకలితో, భయంతో ఏడుస్తున్నారని పోలండ్‌కు చేరుకున్న ఓ శరణార్థి చెప్పారు. తూర్పు ఉక్రెయిన్‌కు 400 టన్నుల ఆహార పదార్థాలను పంపామనీ, అక్కడ మందులు తక్షణ అవసరమని అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సమాఖ్య ప్రతినిధి ఏనెట్‌ యాండర్సన్‌ తెలిపారు. లువ్యూ నగర జనాభా 7 లక్షలే అయినా యుద్ధం వల్ల ఇతర ప్రాంతాల నుంచి అదనంగా మరో 3 లక్షలు వచ్చి చేరారు. ఉక్రెయిన్‌ నుంచి గత మూడు వారాల్లో పొరుగు దేశాలకు తరలివచ్చిన శరణార్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఈ శరణార్థుల్లº సగంమంది బాలబాలికలే. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పరిసరాల నుంచి వచ్చిన కెటరీనా తమ ప్రజలు సర్వం కోల్పోయారనీ.. ఇళ్లూవాకిళ్లూ, బంధుమిత్రులను పోగొట్టుకున్నారని చెప్పారు. కెటరీనా భర్త, తల్లిదండ్రులు ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. వారికి ఎలాగోలా సహాయం చేరేలా చూడటానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. రష్యన్‌ సేనల బాంబుదాడిలో ఒక ప్రసూతి ఆస్పత్రి ధ్వంసమై, పలువురు బాలింతలు మరణించారని స్విత్లానా స్యిచోవా అనే మరో శరణార్థి చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని