Corona Virus: మాస్కు నిబంధనను సడలించొచ్చు

ఆగ్నేయాసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ  భారత్‌లో దానిపై

Updated : 21 Mar 2022 09:23 IST

భారత్‌లో తీవ్ర కొవిడ్‌ ఉద్ధృతులకు ఆస్కారం తక్కువే
నిపుణుల సూచన 

దిల్లీ: ఆగ్నేయాసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ  భారత్‌లో దానిపై కలవరం అనవసరమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ విస్తృతి, అనేక మంది ఇప్పటికే కరోనా బారినపడి కోలుకొని ఉండటం వంటి కారణాలను వారు ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే కొవిడ్‌ ఉద్ధృతులు భారత్‌పై పెను ప్రభావం చూపే అవకాశం లేదని వివరించారు. దీనికితోడు ప్రస్తుతం రోజువారీ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మాస్కు నిబంధనలను సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు. 

కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ తరగతికి చెందిందని దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు సంజయ్‌ రాయ్‌ పేర్కొన్నారు. అందువల్ల దానిలో ఉత్పరివర్తనలు చోటుచేసుకుంటూనే ఉంటాయన్నారు. ఇప్పటికే ఆ వైరస్‌లో వెయ్యికిపైగా మార్పులు జరిగాయని వివరించారు. అయితే ఐదు ఆందోళనకర వేరియంట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ‘‘గత ఏడాది భారత్‌లో తీవ్రస్థాయిలో రెండో కరోనా ఉద్ధృతి తలెత్తింది. అది దురదష్టకరమే. అయితే అదే ఇప్పుడు మన ప్రధాన బలం. సహజసిద్ధ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారికి మెరుగైన, దీర్ఘకాల రక్షణ లభిస్తుంది. విస్తృత స్థాయి వ్యాక్సినేషన్‌ దీనికి తోడైంది. అందువల్ల భవిష్యత్‌లో కరోనా ఉద్ధృతి వచ్చినా అది పెను ప్రభావం చూపకపోవచ్చు’’ అని పేర్కొన్నారు. అందువల్ల మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. వయో వృద్ధులు, ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రం మాస్కులను కొనసాగించాలని కోరారు. కరోనాపై ప్రభుత్వం తన నిఘాను కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశీలించడం ద్వారా.. కొత్త వేరియంట్లను ముందే పసిగట్టాలని సూచించారు. 

కొత్త రకం వచ్చినా.. 

కరోనాలో కొత్త రకం వచ్చినా.. భారత్‌లో మళ్లీ కొవిడ్‌ ఉద్ధృతికి ఆస్కారం తక్కువేనని ప్రజారోగ్య నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా పేర్కొన్నారు. ‘‘సీరో ప్రివలెన్స్, వ్యాక్సినేషన్‌ విస్తృతి, ఒమిక్రాన్‌ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను పరిశీలించినప్పుడు భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి ముగిసినట్లే భావించాలి. కనీసం కొన్ని నెలల పాటు కొత్తగా కేసుల ఉద్ధృతికి అవకాశం చాలా తక్కువ’’ అని పేర్కొన్నారు. మూడు ఉద్ధృతులు, వ్యాక్సినేషన్ల వల్ల హైబ్రిడ్‌ రోగనిరోధక శక్తి పొందినవారు ఎక్కువగా ఉండటం వల్ల.. వ్యాధి ముప్పు పొంచి ఉన్నవారి సంఖ్య తగ్గిపోయిందన్నారు. 

‘‘కొంతకాలం తర్వాత యాంటీబాడీల స్థాయి తగ్గుతుందని మనకు తెలుసు. అయితే హైబ్రిడ్‌ రోగనిరోధక శక్తి ద్వారా రక్షణ కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. ‘మాస్కులు తప్పనిసరి’ అనే నిబంధన నుంచి మెజార్టీ ప్రజలకు మినహాయింపు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీరోపాజిటివిటీ వివరాలను బట్టి చూస్తే జనాభాలో 80-90 శాతం మంది కరోనా వైరస్‌ బారినపడినట్లు స్పష్టమవుతోందని దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో కమ్యూనిటీ మెడిసిన్‌ అధిపతి జుగల్‌ కిషోర్‌ తెలిపారు. మాస్కు నిబంధనను తొలగించొచ్చని ఆయన కూడా సూచించారు. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఛైర్మన్‌ ఎన్‌.కె.అరోడా కూడా వీరి అభిప్రాయాలతో ఏకీభవించారు. అయితే కొత్త వేరియంట్ల ముప్పు నేపథ్యంలో అప్రమత్తత కొనసాగాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని