AAP: దేశవ్యాప్త విస్తరణకు ఆప్‌ సై.. 9 రాష్ట్రాలకు కొత్త ఆఫీస్‌ బేరర్ల నియామకం

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో జోరు మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. దేశవ్యాప్త విస్తరణ దిశగా సోమవారం కీలక ముందడుగు వేసింది. 

Updated : 22 Mar 2022 11:11 IST

గుజరాత్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్‌గా సందీప్‌ పాఠక్‌ 

 తెలంగాణలో ఎన్నికల బాధ్యుడిగా సోమ్‌నాథ్‌ భారతీ 

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో జోరు మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. దేశవ్యాప్త విస్తరణ దిశగా సోమవారం కీలక ముందడుగు వేసింది. తొమ్మిది రాష్ట్రాలకు పార్టీ తరఫున కొత్త ఆఫీస్‌ బేరర్లను నియమించింది. ఈ ఏడాది, వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు అందులో ఉన్నాయి. పంజాబ్‌లో ఆప్‌ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సందీప్‌ పాఠక్‌ గుజరాత్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా నియమితులయ్యారు. పంజాబ్‌లో ఆప్‌ రాజకీయ వ్యవహారాలకు సహ బాధ్యుడిగానూ ఆయన ఉంటారు. పాఠక్‌ను ఆప్‌ చాణక్యుడిగా పిలుస్తుంటారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో, పంజాబ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తెరవెనుక ఆయన కృషి అపారం. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఆయనకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌లో రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దిల్లీకి చెందిన ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ కొనసాగుతారు.

 తెలంగాణలో ఎన్నికల బాధ్యుడిగా సోమ్‌నాథ్‌ భారతీ (దిల్లీ ఎమ్మెల్యే)ని పార్టీ నియమించింది.  ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌పైనా ప్రత్యేకంగా దృష్టిసారించిన ఆప్‌.. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు దుర్గేష్‌ పాఠక్‌ను ఆ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా నియమించింది. దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ హిమాచల్‌లో పార్టీ తరఫున ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉంటారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో సంజీవ్‌ ఝా (దిల్లీ ఎమ్మెల్యే)ను రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా, గోపాల్‌ రాయ్‌ (దిల్లీ మంత్రి)ని ఎన్నికల బాధ్యుడిగా నియమించింది. హరియాణాలో సుశీల్‌ గుప్తా (రాజ్యసభ ఎంపీ), రాజస్థాన్‌లో వినయ్‌ మిశ్ర (దిల్లీ ఎమ్మెల్యే), కేరళలో ఎ.రాజా, అస్సాంలో రాజేశ్‌ శర్మ ఆప్‌ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జులుగా ఉంటారు. ఇతర రాష్ట్రాలకూ ఆఫీస్‌ బేరర్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని