Published : 24 Mar 2022 10:37 IST

River linking: నదుల అనుసంధానానికి ముందుకొస్తే నజరానాలు

ఆయా రాష్ట్రాలకు పన్నులు, గ్రాంట్లలో వాటా పెంపు
ఆర్థికశాఖతో మాట్లాడి అవసరమైన కార్యాచరణ 
జల్‌శక్తి శాఖకు స్థాయీసంఘం సిఫార్సు

ఈనాడు, దిల్లీ: నదుల అనుసంధానం విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర పన్నులు, గ్రాంట్లలో వాటాలు పెంచడంతోపాటు పన్ను రాయితీలు కల్పించే విషయం ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. కేంద్ర జల్‌శక్తిశాఖ ఇందుకు అవసరమైన కార్యాచరణకు ఆర్థికశాఖతో మాట్లాడి తగిన కార్యాచరణ రూపొందించాలని బుధవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. ‘‘ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో కృష్ణా - గోదావరి, కృష్ణా - పెన్నా, పెన్నా - కావేరి, దామన్‌గంగ - పింజల్, పార్‌ - తాపి - నర్మద నదుల అనుసంధానానికి ముసాయిదా డీపీఆర్‌ ఖరారైనట్లు చెప్పారు. దీనివల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే డీపీఆర్‌ అమలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తుందని ప్రకటించారు. ఇందులో ప్రధాన సమస్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే.  సున్నితమైన నీళ్ల అంశం చుట్టూ భావోద్వేగాలు పెనవేసుకుపోయి ఉంటాయి. రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయి నదులపై రాష్ట్రాలు పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం భాగస్వాములందరితో చర్చించాలి. నదుల అనుసంధానం చేయాలని యోచిస్తున్న ప్రాంతాల్లో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని జల్‌శక్తి శాఖ తన వ్యూహాల్లో మార్పులు చేసుకోవాలి’’ అని స్థాయీసంఘం సూచించింది. 

ఒకే ట్రైబ్యునల్‌ను త్వరగా అమల్లోకి తీసుకురావాలి

అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని స్థాయీసంఘం కేంద్రానికి సూచించింది. ఇప్పటి మాదిరి బహుళ ట్రైబ్యునళ్ల వల్ల కాలయాపన తప్ప మరే ప్రయోజనం లేదని పేర్కొంది. ‘‘ప్రస్తుతం ఉన్న కృష్ణా, వంశధార, మహాధాయి, మహానంది, రావి - బియాస్‌ ట్రైబ్యునళ్ల కోసం గత డిసెంబరు నాటికి రూ.106.31 కోట్లు ఖర్చు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారాన్ని క్రమబద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర జలవివాదాల (సవరణ) బిల్లు-2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2019 జులై 31న లోక్‌సభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న బహుళ జలవివాద ట్రైబ్యునళ్ల స్థానంలో ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు బిల్లు అవకాశం కల్పించింది. ఈ బిల్లులోని క్లాజ్‌-3లో మరో సవరణ అవసరమని జల్‌శక్తి శాఖ చెబుతోంది. ఆ అంశాన్ని సొలిసిటర్‌ జనరల్‌తోనూ చర్చించి బిల్లు రాజ్యసభకు వెళ్లేలోపే సవరణ చేయాలని జల్‌శక్తి శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒకే శాశ్వత ట్రైబ్యునల్‌ ఏర్పాటైతే నిర్వహణ ఖర్చులు తగ్గడంతోపాటు వివాదాలను వేగంగా, నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడానికి వీలవుతుంది. అందువల్ల ప్రభుత్వం సవరణలో కూడిన బిల్లు సాధ్యమైనంత వరకు రాజ్యసభలో ఆమోదం పొందడానికి ప్రయత్నించాలి. దీనిపై తీసుకున్న చర్యలను మూడు నెలల్లోపు నివేదించాలి’’ అని స్థాయీసంఘం నిర్దేశించింది. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts