Delhi High Court: దాంపత్యంలో అకారణ నిందలు క్రూరమైనవి: దిల్లీ హైకోర్టు వ్యాఖ్య

దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని రెండోవారు నిర్హేతుకంగా ఆరోపించడం వ్యక్తిత్వంపై తీవ్ర దాడి కిందకే వస్తుందని.. 

Published : 24 Mar 2022 11:01 IST

దిల్లీ: దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని రెండోవారు నిర్హేతుకంగా ఆరోపించడం వ్యక్తిత్వంపై తీవ్ర దాడి కిందకే వస్తుందని.. పేరు ప్రతిష్టలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఓ విడాకుల కేసులో దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిరక్షించాల్సిన పవిత్ర బంధంగా పెళ్లిని ఉద్ఘాటించింది. తప్పుడు ఆరోపణలు తీవ్ర మానసిక వేదనను కలిగిస్తాయి కాబట్టి వాటిని క్రూరమైనవిగా పరిగణించి న్యాయస్థానాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓ విడాకుల కేసులో భార్య ఇటువంటి క్రౌర్యానికి పాల్పడిందని భావించి కుటుంబ కోర్టు ఒకటి భర్తకు అనుకూలంగా 2019 జనవరి 31న తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం కింద భర్తకు విడాకులు మంజూరు చేసింది. దీన్ని భార్య హైకోర్టులో సవాలు చేయగా ఉన్నత న్యాయస్థానం ఆమె అప్పీలును కొట్టివేసింది. ఈ కేసులో దంపతులకు 2014 జూన్‌లో పెళ్లయింది. 

తరవాత కొద్ది కాలానికే పొరపొచ్చాలు రావడంతో విడివిడిగా జీవించసాగారు. తనను మామగారు లైంగికంగా వేధించారంటూ భార్య క్రిమినల్‌ కేసు పెట్టింది. ఇది తన పట్ల క్రూరమైన చర్య అంటూ భర్త కుటుంబ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టారు. కుటుంబ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించిన మీదట భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పిందని హైకోర్టు స్పష్టం చేసింది. భర్త, మామగారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా భార్య వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడిందనీ, వారిద్దరి పట్ల మానసిక క్రౌర్యానికి పాల్పడి తీరని మనోవేదన కలిగించినట్లు కుటుంబ కోర్టు సరైన నిర్ధారణకు వచ్చిందని హైకోర్టు ఉద్ఘాటించింది. భార్య తన ఆరోపణలను నిరూపించలేకపోయిందంటూ ఆమె అప్పీలును కొట్టివేసింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని