Published : 24 Mar 2022 10:40 IST

Joe Biden: రష్యాతో రసాయన ఆయుధాల ముప్పు.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరిక

మాస్కోపై మరిన్ని అంక్షలు!

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొత్తం ఐరోపా ఖండంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం నాలుగు రోజుల కీలక ఐరోపా పర్యటనకు బయల్దేరారు. పర్యటనలో ఆయన నాటో కూటమిలోని మిగిలిన 29 సభ్య దేశాల నేతలతో పాటు.. ఐరోపా సమాఖ్య(ఈయూ)లోని 27 దేశాల అధినేతలతోనూ సమావేశం కానున్నారు. జి-7 కూటమితోనూ యుద్ధ పరిస్థితులను సమీక్షంచనున్నారు. ఐరోపా దేశాలతో కలిసి మరిన్ని ఆంక్షలను రష్యాపై బైడెన్‌ ప్రకటించనున్నారు. ముడిచమురు, సహజ వాయువు విషయంలో మాస్కోపై ఐరోపా అధికంగా ఆధారపడుతున్న అంశం కూడా అమెరికా అధ్యక్షుడి చర్చల్లో ప్రస్తావనకు రానుంది. ఐరోపా నేతలతో భేటీ తర్వాత.. ఉక్రెయిన్‌ నుంచి వేలాదిగా తరలివస్తున్న శరణార్థులకు ఆశ్రయమిస్తున్న పొలండ్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ భారీగా మానవతా సాయం ప్రకటించే అవకాశం ఉంది. అక్కడి అమెరికా దళాలను కలవనున్నారు. పర్యటనకు బయల్దేరే ముందు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా.. రసాయన ఆయుధాలతో దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

చెర్నోబిల్‌ ప్రయోగశాలను ధ్వంసం చేసిన రష్యా

లివీవ్‌: రేడియో ధార్మిక పదార్థ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఇతరత్రా అనేక పనులు చేసేందుకు చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కర్మాగారంలో ఉన్న నూతన ప్రయోగశాలను రష్యా సేనలు బుధవారం ధ్వంసం చేశాయి. వినియోగంలో లేని చెర్నోబిల్‌ ప్లాంటును ఇటీవల రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కర్మాగారంలో ప్రయోగశాలను 2015లో ప్రారంభించారు. దీనిలో నిల్వ ఉన్న అత్యంత క్రియాశీలకమైన నమూనాలు, రేడియోన్యూక్లైడ్‌ నమూనాలు ఈ ప్రయోగశాలలో నిల్వ ఉన్నాయి. రేడియో న్యూక్లైడ్‌లు అస్థిర అణువులు. అవి రేడియోధార్మికతను వెలువరిస్తాయి. ఇవన్నీ ఇప్పుడు శత్రువు చేతిలోకి వెళ్లాయని, దీనివల్ల నాగరిక ప్రపంచానికి కాకుండా శత్రువుకే హాని అని ఉక్రెయిన్‌ అణు నియంత్రణ సంస్థ వర్గాలు తెలిపాయి. రేడియో ధార్మికతను పర్యవేక్షించేందుకు కర్మాగారం చుట్టుపక్కల ఉన్న యంత్రాలు పనిచేయడం లేదనీ, ఇది మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. 

రష్యా బలగాలు యుద్ధనేరాలకు పాల్పడ్డాయ్‌: బ్లింకెన్‌

రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు తాము గుర్తించామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. సంబంధిత నేరగాళ్లపై విచారణ జరిపేందుకు మిత్ర దేశాలు, అవసరమైన అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. నాటో నేతల అత్యవసర సదస్సులో పాల్గొనేందుకుగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి బుధవారం బ్రస్సెల్స్‌కు బయలుదేరడానికి ముందు బ్లింకెన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts