మగతోడు లేదని ఆడవాళ్లను విమానాలు ఎక్కనివ్వని తాలిబన్లు

మహిళలు మగతోడు లేకుండా పయనించకూడదనే మధ్యయుగాల నాటి నియమాన్ని ఆధునిక యుగానికి ప్రతీక అయిన విమానాల్లోనూ

Updated : 27 Mar 2022 12:02 IST

ఇస్లామాబాద్‌: మహిళలు మగతోడు లేకుండా పయనించకూడదనే మధ్యయుగాల నాటి నియమాన్ని ఆధునిక యుగానికి ప్రతీక అయిన విమానాల్లోనూ అమలు చేయడం తాలిబన్లకే చెల్లింది. వీరి దుందుడుకు చర్యల ఫలితంగా.. ముందే టికెట్లు బుక్‌ చేసుకొని కూడా అఫ్గాన్‌ స్త్రీలు విమానమెక్కడానికి నోచుకోలేకపోయారు. కెనడా తదితర దేశాల పౌరసత్వం ఉన్న అఫ్గాన్‌ మహిళలూ రెక్కలు తెగిన విహంగాల్లా నేల మీదే నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. పాకిస్థాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను తాలిబన్‌ ప్రభుత్వ ఆదేశాల వల్ల విమానాలు ఎక్కనివ్వలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. పురుషుల తోడు లేకుండా వారు విమాన ప్రయాణాలు చేయకూడదట! తర్జన భర్జనల తరవాత కొందరు మహిళలు ఒంటరిగా హెరాత్‌ వెళ్లే విమానం ఎక్కడానికి తాలిబన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఆ విమానం ఆలస్యంగా రావడంతో మహిళలు లేకుండానే ఎగిరిపోయింది. ఏ మహిళ అయినా 72 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణించాలంటే మగతోడు తప్పనిసరి అని తాలిబన్‌ సర్కారు కొంతకాలం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. విమాన ప్రయాణాలను ఈ నియమం నుంచి మినహాయిస్తారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

* బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్లకు పంపకూడదనే నిషేధాన్ని ఎత్తివేస్తామని గతంలో చేసిన వాగ్దానాన్ని సైతం తాలిబన్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇప్పుడు కొత్తగా విమానాల్లోకీ అనుమతించేది లేదంటోంది. వీరి నిర్వాకాలు అంతర్జాతీయ సమాజానికే కాదు.. స్థానికులకూ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాలికలను హైస్కూళ్లకు వెళ్లనివ్వాలని కోరుతూ కాబుల్‌లో ప్రదర్శనలు జరిగాయి. వీటిలో బాలికలే ఎక్కువగా పాల్గొన్నారు. తాలిబన్లు పదేపదే వాగ్దానభంగానికి పాల్పడటం వల్ల వారి మీద నమ్మకం పోతోందని అఫ్గాన్‌ పౌరహక్కుల ఉద్యమకారిణి మెహబూబా సిరాజ్‌ జాతీయ టీవీ ఛానల్‌ టోలో టీవీలో వ్యాఖ్యానించారు. వేలాది వాలంటీర్లతో డజన్లకొద్దీ రహస్య స్కూళ్లను నడుపుతున్న దాతృత్వ సంస్థ పెన్‌పాథ్‌ బాలికలను హైస్కూళ్లకు వెళ్లనివ్వాలంటూ దేశమంతటా ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

* అఫ్గానిస్థాన్‌లో పూర్తిగా బాలికలతోనే రోబోటిక్స్‌ బృందాన్ని స్థాపించిన రోయా మెహబూబ్‌ అనే అఫ్గాన్‌ మహిళా వ్యాపారవేత్తకు ఖతర్‌లోని దోహా ఫోరమ్‌-2022 శనివారం అవార్డు ప్రదానం చేసింది. అఫ్గాన్‌ బాలికలకు స్కూళ్లలో ప్రవేశం కల్పించాలంటూ ప్రపంచ దేశాలు తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్‌ చేశారు. తాలిబన్లు అధికారంలోకి రాగానే మెహబూబ్‌ రోబోటిక్స్‌ టీం అఫ్గాన్‌ వీడి వచ్చేసినా.. అక్కడి బాలికల కోసం సైన్స్, టెక్నాలజీ కేంద్రాన్ని నిర్మించాలని ఆమె ఆశిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ నిరుపేద దేశమనీ, అక్కడి ప్రజలకు విజ్ఞానం అందకుండా చేస్తే వారి భవిష్యత్తు ఏమవుతుందని మెహబూబ్‌ ప్రశ్నిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని