Updated : 30 Mar 2022 09:21 IST

Andhra News: ఏపీలో 2020లో లక్ష కిలోల గంజాయి స్వాధీనం

కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఏపీలో 2018లో 33,930.522 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా 2020లో అంతకు మూడురెట్లు ఎక్కువగా 1,06,042.775 కిలోలు చిక్కినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ఓబీసీల గణనకు జన గణన చట్టం-1948లో మార్గదర్శకాల్లేవని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్‌ తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఓబీసీలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో తేడా ఉండటం.. సమగ్ర సమాచారం లేకపోవడంతో గణన క్లిష్టతతో కూడుకుందని పేర్కొన్నారు.

* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ) కింద 2022 మార్చి 23 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 67,819 ఇళ్లు మంజూరు చేయగా 46,708 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు.

* హైదరాబాద్‌లోని ఫైర్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఎఫ్‌ఎస్‌టీఐ)లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. చేవెళ్ల, మహబూబాబాద్, పెద్దపల్లి ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, బొర్లకుంట వెంకటేష్‌ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.

* 2012 నుంచి 2021 వరకు కేంద్ర సాయుధ బలగాల్లో 1205 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

* ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌కు సంబంధించి ఏపీకి 266, తెలంగాణకు 138 స్టేషన్లు మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుజ్జర్‌ వెల్లడించారు.

* రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... కాకినాడ సమీప ఉప్పాడలో మత్స్య శుద్ధి కేంద్రం(ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌) ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని ఏపీ ప్రభుత్వం తెలిపినట్లు కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు.

* కొవిడ్‌ నిబంధనల వల్ల మత్స్య రైతులపై ఎటువంటి ప్రభావం పడలేదని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసిందని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల పథకం కింద తెలంగాణకు మంజూరైన 14,230 కిలోమీటర్ల పొడవైన 3,453 రోడ్లలో 11,559 కిలోమీటర్ల పొడవైన 3,030 రోడ్ల పనులు పూర్తయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. చేవెళ్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, బొర్లకుంట వెంకటేష్‌ నేత, పసునూరి దయాకర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* రాజమహేంద్రవరం, విశాఖపట్నం సెంట్రల్‌ జైళ్లలో సామర్థ్యానికి మంచి ఖైదీలు ఉన్నారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర వెల్లడించారు. విశాఖపట్నం, హిందూపురం ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

సాగరమాల ప్రాజెక్టులకు రూ.278 కోట్లు

ఏపీలో సాగరమాల కింద రూ.1,380.03 కోట్లతో చేపట్టిన 12 ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.278.74 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 5 ప్రాజెక్టులు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. ఆయన మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు రూ.54 కోట్లు

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె దగ్గర ఏర్పాటు చేస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ కోసం ఇప్పటివరకు రూ.54 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. ఆయన మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం సమాచారం అందించినట్లు తెలిపారు.

డీఆర్‌ చెల్లింపులపై విశాఖ పోర్టు ట్రస్టు ఉద్యోగుల నుంచి వినతి

ఈనాడు, దిల్లీ: అర్హులైన పెన్షనర్లకు పింఛను చెల్లింపుల్లో తేడా ఉన్నందున ఆ మేరకు డియర్‌నెస్‌ రిలీఫ్‌ చెల్లించాలని కోరుతూ విశాఖపోర్టు ట్రస్టు ఉద్యోగుల సంఘం నుంచి వినతిపత్రం అందినట్లు కేంద్ర నౌకాయానశాఖ సహాయ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. ఆయన మంగళవారం అస్సాం కాంగ్రెస్‌ సభ్యుడు రిపున్‌ బోరా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చెన్నై పోర్టు ట్రస్టు 1997-98కి ముందు, 1997-98 తర్వాత రిటైరైన వారికి చెల్లించే డియర్‌నెస్‌ రిలీఫ్‌ విషయంపై 2005 నుంచి వివాదం నడిచింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు కేంద్ర నౌకాయానశాఖ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టేసి 2013 ఆగస్టు 6న మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెన్నై పోర్టుకే వర్తిస్తుంది. అలాంటి ఉపశమనమే విశాఖపట్నం పోర్టుకు వర్తింప జేయాలంటే దానిపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం విస్తృత చర్చలు జరిపి, దానివల్ల పోర్టుపై పడే ఆర్థికభారం ఎంతో చూడాలి’ అని సోనోవాల్‌ తెలిపారు.  

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని