Ukraine Crisis : చమురు సరఫరా పెంపునకు అమెరికా నిర్ణయం

ఉక్రెయిన్‌పై దండెత్తినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినందున అంతర్జాతీయంగా చమురు 

Updated : 01 Apr 2022 10:16 IST

కీలక నిల్వల నుంచి రోజుకు 10 లక్షల పీపాలు విడుదల

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై దండెత్తినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినందున అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడం దీనికి ప్రధాన కారణం. చమురు ధరల కట్టడికి తమ వద్దనున్న కీలక నిల్వల నుంచి రోజుకు 10 లక్షల పీపాల చమురును విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు. ఆరు నెలలపాటు ఈ సరఫరా కొనసాగుతుందని శ్వేతసౌధ అధికారులు చెప్పారు. రష్యా నుంచి దిగుమతులు నిలచిపోయినా సౌదీ అరేబియా, యుఏఈలు చమురు ఉత్పత్తిని పెంచకపోవడం వల్ల కొరత ఏర్పడి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెరిగి బైడెన్‌ పట్ల ప్రజాదరణ తగ్గిపోతోంది. దీంతో తమ కీలక చమురు నిల్వల నుంచి సరఫరాలు పెంచాలని బైడెన్‌ సర్కారు నిశ్చయించినట్లు తెలుస్తోంది. అమెరికా ఇంధన శాఖ వద్ద మార్చి 25 నాటికి 58.6 కోట్ల పీపాల కీలక నిల్వలు ఉన్నాయి. నిరుడు నవంబరులో అమెరికా, దాని మిత్రదేశాల కీలక నిల్వల నుంచి 5 కోట్ల పీపాలు విడుదల చేశారు. యుద్ధం ప్రారంభమయ్యాక మరో 6 కోట్ల పీపాలు విడుదలయ్యాయి. అమెరికా ఆలోచనకు భారత్‌ మద్దతు పలికింది.

శరణార్థుల స్వీకరణకు అమెరికా సన్నాహాలు

ఉక్రెయిన్‌ నుంచి తరలివెళ్లిన 36 లక్షల మంది శరణార్థుల్లో లక్ష మందికి తమ దేశంలో ఆశ్రయమిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గతవారం ప్రకటించారు. శరణార్థి ప్రవాహాన్ని ఎదుర్కొంటున్న పొరుగు దేశాలకు 100 కోట్ల డాలర్లను మానవతా సాయం కింద అందిస్తామన్నారు. బైడెన్‌ ప్రకటనను పురస్కరించుకుని అమెరికాకు వచ్చే ఉక్రెయిన్‌ శరణార్థులకు ఆహారం, బస, ఇతర సహాయం అందించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

రష్యా దిగుమతులపై ఆస్ట్రేలియా నిషేధం 

రష్యా నుంచి చమురు, ఇంధన దిగుమతులపై ఏప్రిల్‌ 25 నుంచి 35% అదనపు రుసుం విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. క్రమంగా ఆ దేశం నుంచి దిగుమతుల్ని నిషేధిస్తామని తెలిపింది. 

రష్యా సహజవాయువుపై కరెన్సీ నిబంధనల సడలింపు 

మాస్కో: స్నేహపూరితంగా మెలగని దేశాలు ఇకపై తమ నుంచి సహజ వాయువును దిగుమతి చేసుకోవాలంటే రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలన్న నిబంధనను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సడలించారు. రష్యాలోని ఒక బ్యాంకు ద్వారా మునుపటి మాదిరిగా విదేశీ కరెన్సీలోనూ చెల్లింపులు చేయవచ్చని, ఆ బ్యాంకు దానిని రూబుల్స్‌లోకి మారుస్తుందని అధ్యక్ష భవనం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ మేరకు దిగుమతిదారులు ఆ బ్యాంకులో రెండు ఖాతాలు తెరవాలి. విదేశీ కరెన్సీ చెల్లుబాటయ్యే ఖాతాలో డబ్బు జమ చేసి, దానిని రూబుల్స్‌లోకి మార్చాలని కోరితే రెండో ఖాతాలో అవి జమ అవుతాయి. దాని ద్వారా చెల్లింపులు జరుగుతాయి.

నిషేధమంటే యుద్ధంతో సమానమే 

బ్రసెల్స్‌: ఉక్రెయిన్‌పై వేరే దేశాల విమానాలు వెళ్లకుండా నిషేధం విధించడమంటే అది నేరుగా రష్యాపై యుద్ధం ప్రకటించడంతో సమానమనీ, దానివల్ల మరింత ప్రాణనష్టం వాటిల్లడమే తప్పిస్తే ఎలాంటి పరిష్కారం లభించదని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డీక్రూ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం వీడియో సదస్సు ద్వారా బెల్జియం చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. దీనిపై అలెగ్జాండర్‌ స్పందించారు. యుద్ధంలో నాటో భాగస్వామి కాదని చెప్పారు.

బిహార్‌ ప్రాజెక్టుపై యుద్ధ ఆంక్షల ప్రభావం 

దిల్లీ: బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం పడింది. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నాయి. యుద్ధ నేపథ్యంలో రష్యాపై వివిధ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై ఉంటుందని కేంద్రం పార్లమెంటులో ఓ ప్రకటన చేసింది. రూ.21,312 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న 3×660 మెగావాట్ల థర్మల్‌ ప్రాజెక్టు మొదటిదశకు సామగ్రి, పర్యవేక్షణకు సాంకేతిక సిబ్బంది రష్యా నుంచి రావాల్సి ఉందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లోక్‌సభకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని