Joe Biden : బైడెన్‌కు పుత్ర గండం పొంచి ఉందా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌ ఇంధన కంపెనీ బురిస్మా బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు

Updated : 03 Apr 2022 10:10 IST

ఉక్రెయిన్‌ కంపెనీ వ్యవహారంలో హంటర్‌ బైడెన్‌పై వాంగ్మూలం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌ ఇంధన కంపెనీ బురిస్మా బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు స్వీకరించిన చెల్లింపులు, ఆయన ఆదాయంపై ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీ ఇటీవల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే దీని ఆధారంగా హంటర్‌పై కేసు పెడతారా లేదా అన్నది స్పష్టం కావడం లేదు. హంటర్‌ బైడెన్‌కు విదేశాల నుంచి అందిన చెల్లింపులు, ఆయన ఆర్థిక స్థితిపై 2018 నుంచి ఫెడరల్‌ పన్ను అధికారులు జరుపుతున్న విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది ఒబామా ప్రభుత్వంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు హంటర్‌ ఉక్రెయిన్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేరారు. అప్పట్లో బైడెన్‌ ఉక్రెయిన్‌ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్లు హంటర్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌ వ్యాపార లావాదేవీలను ఎన్నికల సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దానికి ఏడాది ముందు అమెరికా నుంచి సైనిక సహాయం పొందాలంటే హంటర్‌ లావాదేవీలపై దర్యాప్తు జరపాలని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీపై నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారు. ఈ ఏడాది ప్రజాప్రతినిధుల సభకు మధ్యంతర ఎన్నికలు జరగనున్నందున హంటర్‌ బైడెన్‌ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు రిపబ్లికన్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

భారత సంతతికి ముఖ్య పదవులు

భారత సంతతికి చెందిన న్యాయవాది కల్పనా కొటగళ్, సర్టిఫైడ్‌ పబ్లిక్‌ ఎకౌంటెంట్‌ వినయ్‌ సింగ్‌లను కీలక పదవుల్లో నియమించాలని బైడెన్‌ నిర్ణయించారు. సమాన ఉద్యోగావకాశాల సంఘం కమిషనర్‌గా కల్పనను, గృహవసతి, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన ఫైనాన్స్‌ అధికారిగా వినయ్‌ను నామినేట్‌ చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని