Updated : 05 Apr 2022 09:18 IST

Srilanka Crisis: శ్రీలంక సంక్షోభం మనకూ గుణపాఠమే

విచ్చలవిడిగా అప్పులు చేస్తే ఇదే గతి
ఉచిత పథకాలతో ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది
హెచ్చరించిన ఆర్థిక నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయంతో సంబంధం లేకుండా, విచ్చల విడిగా అప్పులుచేసే ప్రభుత్వాలకు, పాలకులకు శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఒక గుణపాఠమని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెచ్చి, జనాకర్షక పథకాలకు పంచితే... ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా ఇలాంటి పరిస్థితులు తప్పవన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు ఇస్తోందన్న అంశంపై ఈటీవీ ‘ప్రతిధ్వని’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర ఆచార్యుడు చిట్టేడి కృష్ణారెడ్డి, ఉత్తరాఖండ్‌లోని హెచ్‌ఎన్‌బీజీ యూనివర్సిటీ బిజినెస్‌ మేనేజిమెంట్‌ ఆచార్యుడు మహేంద్ర కురువ పాల్గొన్నారు. శ్రీలంకలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం ఆ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

సాధ్యంకాని హామీలతో చేటే...

ఓట్ల కోసం రాజకీయ పార్టీలు సాధ్యంకాని హామీలిస్తూ, ఉచిత పథకాలు ఎక్కువగా అమలుచేస్తే ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని కృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంకన్నా, రాజకీయ లబ్ధి కోసమే కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను తీసుకొస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా పథకాలు ఉండాలే తప్ప, వారిని బద్ధకస్తులను చేసేలా ఉండటం సరికాదన్నారు. దేశాభివృద్ధికి అప్పులు అవసరమేగానీ, ఊబిలో కూరుకుపోయేలా ఉండకూడదని సూచించారు. తీసుకున్న రుణాలను దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఖర్చు చేయాలన్నారు. శ్రీలంక ప్రపంచ రుణ సంస్థల నుంచే కాకుండా, 6% వడ్డీతో ఇతర సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకొచ్చిందని... అక్కడ ప్రజల ఆదాయం రూ.100 ఉంటే, అప్పు రూ.250 వరకూ ఉంటోందని ఆయన విశ్లేషించారు. గతంలో వెనెజువెలాలో వజ్రాలు కుప్పలుగా పోసేవారని, 20 ఏళ్ల వ్యవధిలో ఆ దేశ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడానికి పాలకుల విధానాలే కారణమన్నారు. ఆచరణ సాధ్యంకాని పథకాల అమలు, పన్నులను రద్దు చేయడం వల్లే ఆ దేశం ఆర్థికంగా పతనమైందన్నారు. పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ప్రజలను ఆకర్షించేందుకు పన్నుల భారం తగ్గించడం, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు అమలుచేయడం మంచిది కాదన్నారు. సంకుచిత రాజకీయ మనస్తత్వమున్న రాజకీయ నాయకుల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ఆచరణ సాధ్యంకాని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతుబంధు మంచి పథకమే అయినా, వ్యవసాయం చేయని, ధనిక రైతులకు లబ్ధి చేకూర్చడం సరికాదన్నారు. పేదలకు ఇళ్లు కట్టివ్వడం దశాబ్దాలుగా కొనసాగుతోందని, అయితే కుటుంబాల సంఖ్య కంటే, లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉండటం పథకాల అమలు తీరును ప్రతిబింబిస్తోందన్నారు. పేదరిక నిర్మూలనకు రూ.లక్షల కోట్లతో వందల పథకాలు అమలుచేస్తున్నా, ఫలితాలు నామమాత్రంగానే ఉన్నాయన్నారు.

దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్లే...

శ్రీలంక ఎగుమతులతో పోలిస్తే, డాలర్లలో చెల్లింపులు జరపాల్సిన దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్లే ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, అప్పులు చెల్లించేందుకు ఇంకా ఇంకా అప్పులు చేయాల్సిన దుస్థితి ఆ దేశంలో నెలకొందని మహేంద్ర కురువ విశ్లేషించారు. అమెరికా, చైనా, భారత్‌ల వద్ద అప్పులు తీసుకున్న శ్రీలంక... ఆ సొమ్ముతోనైనా కాస్త స్థిరత్వం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడితే, మిగతా దేశాలు అప్పులివ్వడానికి ముందుకు వస్తాయన్నారు. శ్రీలంక కేవలం 2 బిలియన్‌ డాలర్లతో నెగ్గుకు రావడం సాధ్యంకాదన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక మన దేశంలోని రాష్ట్రాలకు గతంలో మాదిరిగా ఆదాయాలు లేవన్నారు. అప్పుల కోసం పురపాలక ఆస్తులను తనఖా పెట్టడం వంటి ఘటనలను నిరోధించాలని మహేంద్ర కురువ సూచించారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించి, ఆ సొమ్ముతో ఓట్లను కొనడం వంటి పరిణామాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. 

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts