Indian Army: అగ్నివీరుల్లారా.. రారండి!

సైన్యంలో ఓ మూడేళ్లు సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నారా..! 

Updated : 07 Apr 2022 11:42 IST

యువత కోసం సైన్యం త్వరలో కొత్త పథకం
మూడేళ్లు సైనికుడిగా పనిచేసే అవకాశం!

​​​​​

ఈనాడు, దిల్లీ: సైన్యంలో ఓ మూడేళ్లు సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నారా..! ఆ తర్వాత సాధారణ ఉద్యోగానికి మారాలనుకుంటున్నారా..! అయితే మీ కోసం త్వరలో ఓ కొత్త పథకాన్ని సైన్యం ప్రకటించనుంది. పేరు ‘అగ్నిపథ్‌ ప్రవేశ పథకం’. దీని ప్రకారం మూడేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకుంటారు. వీరిని అగ్ని వీరులని పిలుస్తారు. త్రివిధ దళాల్లో వివిధ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. ప్రత్యేక విధులతో పాటు సంక్లిష్ట వాతావరణాల్లోనూ వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలో అత్యంత ధైర్యసాహసాలను చూపిన వారిని సైన్యమే రిక్రూట్‌ చేసుకుంటుంది. మిగిలిన వారికి ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు కల్పిస్తుంది.

పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు చెందిన భద్రతా సంస్థలు కూడా వీరిని నియమించుకునేలా చర్చలు జరుగుతున్నాయి. ‘అగ్నిపథ్‌’ పథకంపై గత కొంతకాలంగా త్రివిధ దళాలు కసరత్తు చేస్తున్నాయి. ఇది దాదాపు తుది దశలో ఉందని సమాచారం. కరోనా కారణంగా రెండేళ్లుగా సైన్యంలోకి రిక్రూట్‌మెంట్‌ అంతంతమాత్రంగానే జరిగింది. త్రివిధ దళాల్లో దాదాపు 1.25 లక్షలు ఖాళీలు ఉన్నాయని అంచనా. ‘అగ్నిపథ్‌’ పథకంతో జీతం, పింఛను తదితర ఖర్చులు తగ్గుతాయని.. ఓ అధికారి తెలిపారు. ‘‘అద్భుతంగా రాణించిన వారిని ఉంచుకుంటాం. మిగిలిన మెజారిటీ యువకులు సైన్యం నుంచి నిష్క్రమిస్తారు. ఓ రకంగా ఇది తక్కువ వ్యవధి గల ఓ సైనిక ఉద్యోగం’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ్ల 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని