Covid Restrictions: మాస్కుల నిబంధన తప్పనిసరా!

కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరా? రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో విసిగిపోయిన

Updated : 08 Apr 2022 11:08 IST

తగు జాగ్రత్తలతో ఎత్తివేయవచ్చంటున్న నిపుణులు

దిల్లీ: కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరా? రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో విసిగిపోయిన ప్రజల్లో ఎక్కువ మంది ఈ భావన వ్యక్తం చేస్తుండగా.. వారికి కొంత ఊరటనిచ్చే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. పలు ఇతర దేశాల్లో మాదిరిగా భారత్‌లోనూ మాస్కుల నిబంధనను సడలించవచ్చని సూచిస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధించడం వంటివి అవసరం లేదని హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయ ఆచార్యుడు గౌతమ్‌ మీనన్‌ చెప్పారు. మాస్కుల వల్ల ఉపయోగాన్ని మాత్రం అందరికీ తెలియజెబుతూనే ఉండాలని సూచించారు. దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో ‘మాస్కులు తప్పనిసరి’ నిబంధనను ఎత్తివేశారు. భవిష్యత్తులో ఆందోళనకర రీతిలో మరేదైనా కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే.. అప్పుడు మళ్లీ మాస్కుల నిబంధనను అమలు చేయవచ్చని, ప్రస్తుతానికి ఎత్తివేయవచ్చని అంటువ్యాధుల నిపుణుడు లక్ష్మీనారాయణ్‌ సూచించారు. అవసరమైతే మాత్రం మళ్లీ మాస్కులు ధరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు మాస్కుల కన్నా కొవిడ్‌ బూస్టర్‌ టీకాలు కీలకమని మీనన్‌ తెలిపారు.

కొత్త కేసులు తగ్గినందున సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. అయితే కొవిడ్‌ మహమ్మారి అంతమైందనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దిల్లీలోని జాతీయ ఇమ్యునాలజీ సంస్థకు చెందిన శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ సూచించారు. కొవిడ్‌ బెడద ముగిసిందనే తప్పుడు ప్రచారం, మాస్కులు, భౌతిక దూరం పాటింపు నియమాలను పూర్తిగా ఎత్తివేయడం, ఒమిక్రాన్‌ ‘బీఏ.2’ వేరియంట్‌ వ్యాపించడం వల్ల కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చైనాలోనూ మళ్లీ కొవిడ్‌ విజృంభణ పెరిగింది. అయితే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నమని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో ఇంతవరకు 185.20 కోట్ల కొవిడ్‌ టీకాలు వేయడం, జనాభాలో చాలామందికి గతంలో కరోనా వైరస్‌ సోకి రోగనిరోధక శక్తి పెరగడం వల్ల నిరుడు డెల్టా వేరియంట్‌ సృష్టించినంత నష్టం భవిష్యత్తులో ఉండకపోవచ్చని మీనన్‌ అభిప్రాయపడ్డారు. టీకాల వల్ల వైరస్‌ తీవ్రత తగ్గినా అప్రమత్తంగానే ఉండాలని సత్యజిత్‌ రథ్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని