ED: రుణ యాప్‌ సంస్థల వివరాలివ్వండి.. గూగుల్‌ సంస్థకు ఈడీ సమన్లు

చైనా రుణ యాప్‌ల కేసు దర్యాప్తులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) దూకుడు పెంచింది. యాప్‌ల ద్వారా జారీ చేసిన రుణాల వసూలులో అడ్డగోలు దందా చేయడంతో

Published : 13 Apr 2022 10:51 IST

అంతిమ లబ్ధిదారుల్ని గుర్తించేందుకే..

 ఈనాడు, హైదరాబాద్‌ 

చైనా రుణ యాప్‌ల కేసు దర్యాప్తులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) దూకుడు పెంచింది. యాప్‌ల ద్వారా జారీ చేసిన రుణాల వసూలులో అడ్డగోలు దందా చేయడంతో పాటు వేధింపులకు దిగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా అక్రమంగా సూక్ష్మరుణాలు మంజూరు చేసిన దాదాపు 38 నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లతో పాటు 300 ఫిన్‌టెక్‌ కంపెనీల వ్యవహారంపై హైదరాబాద్‌ ఈడీ దర్యాప్తు చేస్తోంది. యాప్‌ల ద్వారా జరిపిన లావాదేవీల ద్వారా రూ.వేల కోట్ల నిధులు హవాలా మార్గంలో దేశం దాటాయనేది ప్రధాన ఆరోపణ. అంతిమ లబ్ధిదారులు చైనాలో ఉన్నారని ఈడీ అనుమానిస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వాహకులు గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌లను ఉంచి లావాదేవీలు సాగించిన దృష్ట్యా.. గూగుల్‌ సంస్థ ప్రతినిధులకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఆయా యాప్‌ల వివరాలివ్వాలని కోరింది. 

మూతపడిన ఎన్‌బీఎఫ్‌సీలతో ఫిన్‌టెక్‌ సంస్థల ఒప్పందం
భారతీయులు డైరెక్టర్లు అయితేనే ఎన్‌బీఎఫ్‌సీని స్థాపించేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తుంది. రుణ వ్యాపారం నిర్వహించేందుకు చైనా దేశస్థులు తెలివిగా ఫిన్‌టెక్‌ కంపెనీలను ఏర్పాటు చేసి.. మూతపడిన ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూతపడిన ఎన్‌బీఎఫ్‌సీలకు గ్యారంటీ కింద ఫిన్‌టెక్‌ కంపెనీలే సెక్యూరిటీ డిపాజిట్లను సమకూర్చాయి. ఫిన్‌టెక్‌లలో నిధులన్నీ చైనా దేశస్థులవేనని ప్రధాన అభియోగం. ఈ ఎన్‌బీఎఫ్‌సీలు పేటీఎం లాంటి పేమెంట్‌ గేట్‌వేల ద్వారా ప్రత్యేకంగా మర్చంట్‌ ఐడీలను తెరిచి.. వాటిలోకి సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి తెప్పించాయి. రుణ వ్యాపారంలో తెరపై ఎన్‌బీఎఫ్‌సీలు కనిపిస్తున్నా.. లాభాలన్నీ చైనా కంపెనీల్లోకే వెళ్లాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వ్యక్తిగత రుణాల మంజూరులో పెద్దఎత్తున వడ్డీ వసూలు చేశారు. ప్రాసెసింగ్‌ రుసుం రూపంలోనే 20 శాతం వరకు తీసుకున్నారు.

కుడోస్‌ అనే ఫైనాన్స్‌ సంస్థ కేవలం రూ.10 కోట్ల నికర పెట్టుబడితో రెండేళ్లలో ఏకంగా రూ.2,224 కోట్ల లావాదేవీలు నిర్వహించింది. దీన్ని బట్టి ఈ సంస్థలు భారీ వసూళ్లకు పాల్పడి ఉంటాయని ఈడీ భావిస్తోంది. ఒక్కో ఎన్‌బీఎఫ్‌సీ గరిష్ఠంగా దాదాపు 30-40 వరకు ఫిన్‌టెక్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని.. ఏడాది కాలంలో రూ.వెయ్యి కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించిందనే అనుమానాలున్నాయి. ఈ నిధుల అంతిమ లబ్ధిదారులు చైనాలో ఉన్నారనే అనుమానాల నేపథ్యంలో వారి గుట్టు తేల్చేందుకే ఈడీ తాజాగా గూగుల్‌కు సమన్లు జారీ చేసింది.                                                                                                                                                                                                                            

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని