ఇద్దరు మహిళల వివాహాన్ని గుర్తించం

స్వలింగ సంపర్కుల వివాహానికి హిందూ వివాహ చట్టం అడ్డు చెప్పనందున... ఆ చట్టం కింద తమ వివాహాన్ని గుర్తించాలంటూ ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది.

Published : 15 Apr 2022 11:11 IST

 స్పష్టం చేసిన అలహాబాద్‌ హైకోర్టు

అలహాబాద్‌: స్వలింగ సంపర్కుల వివాహానికి హిందూ వివాహ చట్టం అడ్డు చెప్పనందున... ఆ చట్టం కింద తమ వివాహాన్ని గుర్తించాలంటూ ఇద్దరు యువతులు చేసిన అభ్యర్థనను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. ఈ తరహా వివాహం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని; చట్టాల ప్రకారం చూసినా ఇది చెల్లదని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వాదనలు వినిపించింది. అంజూ దేవి అనే మహిళ... తన 23 సంవత్సరాల కూతురిని మరో 22 ఏళ్ల యువతి అక్రమంగా నిర్బంధించిందని, తన కుమార్తెను అప్పగించాలంటూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇద్దరు యువతులను తమ ముందు ప్రవేశ పెట్టాలంటూ ఈనెల 6న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆ మరుసటి రోజే వారిద్దరూ కోర్టు ముందు హాజరయ్యారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, తమ వైవాహిక బంధాన్ని గుర్తించాలని అభ్యర్థించారు. హిందూ వివాహచట్టం ఇద్దరు వ్యక్తుల వివాహం గురించే ప్రస్తావిస్తున్నాయి తప్ప, స్వలింగ సంపర్కుల వివాహానికి అడ్డుచెప్పడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఇందుకు అడ్డు చెప్పారు. ‘‘సంప్రదాయాలు, మతాలు, చట్టాల ప్రకారమే దేశం నడుస్తోంది. పవిత్ర భారతదేశంలో వివాహాన్ని సంస్కారంగా భావిస్తారు. అది స్త్రీ-పురుషుల మధ్యే జరగాలి’’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... యువతుల అభ్యర్థనను తిరస్కరించింది. యువతి తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌నూ కొట్టేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలను కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. పెళ్లి అనేది కేవలం మనుషుల మధ్య బంధం మాత్రమే కాదని, స్త్రీ-పురుషుల మధ్య ఏర్పడే జీవసంబంధ వ్యవస్థ అని గతంలో విస్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం... వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యతను విధ్వంసం చేస్తుందని అభిప్రాయపడింది.

భార్య వివాహేతర కార్యకలాపాలు భరణం పొందకుండా అడ్డుకోలేవు: దిల్లీ హైకోర్టు
దిల్లీ: భార్య సాగించే క్రూరత్వ చర్యలు, అప్పుడప్పుడు ఏకాంతంలో చేసే వివాహేతర లైంగిక కార్యకలాపాలు... భర్త నుంచి భరణం పొందకుండా ఆమెను అడ్డుకోజాలవని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రధరి సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కేసులో విచారణ న్యాయస్థానం... భార్యకు 2020 ఆగస్టు నుంచి ప్రతినెలా రూ.15 వేల చొప్పున భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. భర్త దీన్ని సవాలుచేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరత్వానికి, వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోందని, తన నుంచి ఆమె దూరంగా ఉంటోందని... అలాంటప్పుడు తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అయితే, ఈ కారణాలను హైకోర్టు తోసిపుచ్చింది. సమర్థుడైన వ్యక్తి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకోకుండా చూడటమే మెయింటినెన్స్‌ చట్ట లక్ష్యమని పేర్కొంది. భార్య పదేపదే వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతూ, దాన్ని కొనసాగించే సందర్భంలో మాత్రమే భరణం చెల్లించకుండా భర్తకు న్యాయపరమైన మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. భార్య క్రూరత్వం కారణంగా విడాకులు మంజూరు చేసిన సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు భరణం ఇప్పించిన విషయాన్ని గుర్తుచేసింది. భార్య వ్యభిచారం చేస్తున్నట్టు భర్త కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిరూపించాల్సి ఉంటుందనీ; అప్పుడప్పుడు ఒంటరిగా వివాహేతర లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే...అది పూర్తిగా వ్యభిచారంలో జీవిస్తున్నట్టు కాదనీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో భర్త దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని