Crime News: ఒకే ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు కుమార్తెల మృతదేహాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నవాబ్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఖగల్‌పూర్‌ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉండడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నలుగురు కుటుంబసభ్యులను

Updated : 17 Apr 2022 11:42 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నవాబ్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఖగల్‌పూర్‌ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉండడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నలుగురు కుటుంబసభ్యులను పదునైన ఆయుధంతో హత్య చేయగా, యజమాని ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారిలో రాహుల్‌తివారీ (42), అతని భార్య ప్రీతి (38), కుమార్తెలు మహి (12), పిహు (7), పోహు (5) ఉన్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రాహుల్‌ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందినది. కొంతకాలంగా ఖగల్‌పూర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మరణించిన అయిదుగురూ చివరిసారిగా శుక్రవారం సాయంత్రం కనిపించారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు తలుపు తట్టారు. అయినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఐదు మృతదేహాలు కనిపించాయి. ఒకవైపు భార్య ప్రీతి, ముగ్గురు కుమార్తెల మృతదేహాలు మంచంపై పడి ఉండగా.. మరోవైపు భర్త రాహుల్‌తివారీ మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన అర్ధరాత్రి దాటాక జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, కుటుంబపెద్ద మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించడంతో.. భార్యాపిల్లలను చంపి తానూ ఉరి వేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. భాజపా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. నేరాలు బాగా పెరిగాయని ఆరోపించారు. ‘‘భాజపా 2.0 పాలనలో, ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోయాయి. ఇదిగో నేరాల చిట్టా’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని