Omicron: చిన్నారుల్లో ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను పెంచుతున్న ఒమిక్రాన్‌

ఇతర కరోనా వైరస్‌లతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల చిన్నారుల్లో ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్‌ (యూఏఐ) కలిగే ముప్పు చాలా ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 19 Apr 2022 11:03 IST

 అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి 

వాషింగ్టన్‌: ఇతర కరోనా వైరస్‌లతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల చిన్నారుల్లో ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్‌ (యూఏఐ) కలిగే ముప్పు చాలా ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. దీనివల్ల వారికి గుండె జబ్బు, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. అమెరికాలోని కొలరాడో, నార్త్‌వెస్ట్రన్, స్టోనీ బ్రూక్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌-19తో ఆసుపత్రిపాలైన 18,849 మంది చిన్నారుల డేటాను వారు విశ్లేషించారు. యూఏఐతో ఆసుపత్రిపాలయ్యే చిన్నారుల సరాసరి వయసు నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గడానికి ఒమిక్రాన్‌ కారణమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్‌తోను, యూఏఐతోను ఆసుపత్రిపాలైన చిన్నారుల్లో 21.1 శాతం మంది ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్‌ వేయడం వంటివి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘తీవ్రస్థాయి యూఏఐ బారినపడ్డ చిన్నారులకు ఎగువ శ్వాస వ్యవస్థలో అవరోధం కలుగుతుంది. ఫలితంగా వారికి గుండెపోటు ముప్పు పెరుగుతుంది. వీరికి ఐసీయూల్లో ఇచ్చే పలురకాల చికిత్సలు అవసరం’’ అని తెలిపారు. గత ఏడాది డిసెంబరు నుంచి అమెరికాలో ఒమిక్రాన్‌ రకం ప్రధాన వేరియంట్‌గా మారిన నేపథ్యంలో దానివల్ల కలిగే నష్టాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే తక్కువ వ్యాధి తీవ్రతను కలిగిస్తోందని తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని