గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాణీ అరెస్ట్‌

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వడగాం నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు జిగ్నేశ్‌ మేవాణీని అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను గుజరాత్‌ నుంచి గువాహటికి గురువారం ఉదయం 11.00 గంటలకు విమానంలో తీసుకువచ్చి,

Updated : 22 Apr 2022 06:39 IST

ప్రధాని మోదీపై ట్వీట్‌ రేపిన వివాదం  
గువాహటికి తరలించిన అస్సాం పోలీసులు

ఈనాడు, గువాహటి, అహ్మదాబాద్‌, దిల్లీ: గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వడగాం నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు జిగ్నేశ్‌ మేవాణీని అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను గుజరాత్‌ నుంచి గువాహటికి గురువారం ఉదయం 11.00 గంటలకు విమానంలో తీసుకువచ్చి, అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గాన కొక్రాఝర్‌కు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి జిగ్నేశ్‌ మేవాణీ ఈ నెల 18న చేసిన ఓ ట్వీట్‌ అరెస్టుకు దారి తీసింది. నాథూరాం గాడ్సే పేరుతో ప్రధాని గురించి ఆయన ట్వీట్‌ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్ర పర్యటనలో నరేంద్ర మోదీ మత సామరస్యాన్ని కాపాడాలని కూడా జిగ్నశ్‌ కోరారు. ఈ ట్వీట్‌పై అస్సాంలోని కొక్రాఝర్‌లో ఫిర్యాదు దాఖలైంది. బోడోలాండ్‌ ప్రాదేశిక మండలి భాజపా నేత అరూప్‌ కుమార్‌ డే ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. దళిత నేతగా పేరున్న జిగ్నేశ్‌ కాంగ్రెస్‌ మద్దతుదారుగా కొనసాగుతున్నారు. ఈయన్ను బుధవారం రాత్రి 11.30కు గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చట్టపరమైన వివాదంగా మారడంతో జిగ్నేశ్‌ పోస్టును ట్విటర్‌ నిలిపివేసింది. ఈ అరెస్టును గుజరాత్‌ కాంగ్రెస్‌ నాయకుడు కన్నయ్య కుమార్‌ గురువారం తెల్లవారుజామున ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించారు. అస్సాం పోలీసుల చర్యతో గుజరాత్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే మద్దతుదారులు, కాంగ్రెస్‌ నేతలు అహ్మదాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆందోళన చేపట్టారు. జిగ్నేశ్‌ను మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ కొక్రాఝర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినట్లు అస్సాం కాంగ్రెస్‌ కమిటీ తరఫు న్యాయవాది భగవతి తెలిపారు.

జిగ్నేశ్‌ ఎవరో తెలియదు : అస్సాం సీఎం

జిగ్నేశ్‌ మేవాణీ ఎవరో తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం వ్యాఖ్యానించారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని జిగ్నేశ్‌ అరెస్టు గురించి మీడియా ప్రశ్నించగా.. ‘ఎవరతను?’ అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్‌ బోరా పోలీసుల చర్యను ఖండించారు. దీనివెనుక భాజపా కుట్ర ఉందని, జిగ్నేశ్‌కు న్యాయనిపుణుల సహకారం అందేలా చూస్తామన్నారు. శుక్రవారం జరగనున్న గువాహటి మున్సిపల్‌ కార్పొరేషను ఎన్నికల కారణంగా రెండు రోజులు వేచి చూస్తామని, ఆ లోపు బెయిలు రాకపోతే ఉద్యమిస్తామని అస్సాం పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి మన్జీత్‌ మహంత తెలిపారు.

మోదీజీ! నిజాన్ని బంధించలేరు : రాహుల్‌గాంధీ

జిగ్నేశ్‌ అరెస్టు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరసన తెలిపారు. ‘‘ప్రజాప్రతినిధిగా జిగ్నేశ్‌ను ఎన్నుకొన్న ప్రజలకు ఇది అవమానకరం. మోదీజీ! అణచివేత ద్వారా నిజాన్ని బంధించలేరు’’ అని పేర్కొన్నారు. ‘‘డరో మత్‌, సత్యమేవ జయతే’’ అంటూ తన ట్వీట్‌కు రాహుల్‌ ట్యాగ్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు జిగ్నేశ్‌ అరెస్టుపై గళమెత్తుతారని పార్టీ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని