Updated : 22 Apr 2022 09:55 IST

Pakistan: చైనా - పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌ అథారిటీ రద్దు

షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వ ఆదేశం

ఇస్లామాబాద్, లాహోర్‌: చైనా - పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ దీన్ని వనరులను వృథా చేసే ‘అనవసరమైన సంస్థ’గా ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.4.5 లక్షల కోట్ల (60 బిలియన్‌ డాలర్లు) ఈ ప్రాజెక్టుకు ఇమ్రాన్‌ సర్కారు 2019లో శ్రీకారం చుట్టింది. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్సు నుంచి పాక్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సు పరిధిలో ఉన్న గదర్‌ ఓడరేవు నడుమ మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళిక ఇది. ఇప్పటికే దీనిపై దాదాపు సగం వ్యయం చేసినట్లు చైనా చెబుతోంది.

ఇమ్రాన్‌కు పటిష్ఠ భద్రత : పాక్‌ ప్రధాని  

మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పటిష్ఠ భద్రత కల్పించాలంటూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించారు. గురువారం రాత్రి లాహోర్‌లో తన మద్దతుదారులతో ఇమ్రాన్‌ ఏర్పాటుచేసిన ర్యాలీకి భద్రతపరంగా ముప్పు ఉన్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరించాయి. దీంతో వర్చువల్‌ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించగా, ఇమ్రాన్‌ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ రక్షణకు తక్షణం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా షెహబాజ్‌ షరీఫ్‌ అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ట్విటర్‌ ద్వారా పేర్కొంది. 

సంకీర్ణ సర్కారుకు తొలి ఎదురుదెబ్బ

పాక్‌ సంకీర్ణ సర్కారు సారథి షెహబాజ్‌ షరీఫ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. కీలక భాగస్వామ్య పక్షమైన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఒత్తిడి మేరకు.. విదేశీ వ్యవహారాల్లో ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా ఉన్న మాజీ రాయబారి తారిఖ్‌ ఫతేమి (77)ని ఆ బాధ్యతల నుంచి షెహబాజ్‌ తప్పించారు.

ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్‌ పరోక్ష విమర్శలు

పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగతమైన పరోక్షదాడి మొదలుపెట్టారు. తన ప్రభుత్వ పతనానికి కొన్ని బలీయమైన శక్తుల తప్పుడు చర్యలే కారణమంటూ విమర్శలు గుప్పించారు. ‘ఒక వ్యక్తి తప్పిదాన్ని మనం ఆ సంస్థకు ఆపాదించలేం’ అంటూ ఆర్మీని మాత్రం సమర్థిస్తూ ట్వీట్‌ చేశారు. పాక్‌లోని కుటుంబసభ్యులు ‘మిస్సింగ్‌’గా పరిగణిస్తున్న ఇమ్రాన్‌ మద్దతుదారులు ఇద్దరు గురువారం బ్రిటన్‌ చేరుకొన్నారు. ఇందులో ఒకరు రిటైర్డ్‌ సీనియర్‌ ఆర్మీ అధికారి ఆదిల్‌ రజా.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని