Andhra News: ఆస్పత్రుల్లో భద్రత డొల్ల.. సీసీ కెమెరాల ఏర్పాటులోనూ అశ్రద్ధే

ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో నిఘా నిద్దరోతోంది. పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించడంలేదు. దీనివల్ల రోగులకు భద్రత ఉండడంలేదు. 

Published : 23 Apr 2022 10:10 IST

తగినంత భద్రతా సిబ్బంది ఏరీ? 
శిశువుల అపహరణ ఘటనలూ ఎన్నో 

ఈనాడు, అమరావతి: ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో నిఘా నిద్దరోతోంది. పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించడంలేదు. దీనివల్ల రోగులకు భద్రత ఉండడంలేదు. కొన్నిసార్లు మద్యం తాగి వస్తున్నవారు కూడా వార్డుల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుబాటులో ఉండే జిల్లా కేంద్రాల్లోని బోధనాసుపత్రులు నిత్యం వందల మందితో కిటకిటలాడుతుంటాయి. ఈ ఆస్పత్రుల్లోనికి ఎవరు, ఎందుకు వస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో.. గమనించే వ్యవస్థ అసలు లేదనే చెప్పాలి. సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతున్నా తగిన సంఖ్యలో ఉండడంలేదు. చిత్తూరు, విశాఖ, గుంటూరు వంటిచోట్ల శిశువులు, వస్తువుల అపహరణ వంటివి అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. సందర్శకుల వద్ద పాసులూ ఉండడంలేదు. విజయవాడ జీజీహెచ్‌లో జరిగిన అత్యాచార ఘటన ఆస్పత్రుల్లోని భద్రత డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఈ ఘటన వైద్యశాలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విషయాన్ని స్పష్టంచేస్తోంది. వేలాది మంది రోగులు, ఇన్‌పేషంట్లు ఉండే బోధనాసుపత్రులను పోలీసుల పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రోడ్డు ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసుల (మెడికో లీగల్‌) నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారు. 

 ‘క్యూ’ల నియంత్రణకే పరిమితం! 

బోధనాసుపత్రుల్లో ప్రైవేట్‌ ఏజెన్సీల ఆధ్వర్యంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది కేవలం ‘క్యూ’ల నియంత్రణకు, రోగులు, వారి సహాయకులకు వైద్యులను కలిసేందుకు ఎటు వెళ్లాలో చెప్పేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఒకవేళ ఆస్పత్రుల్లోనికి వచ్చే వారిని అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పే వారు తక్కువే. ప్రైవేట్‌ ఏజెన్సీల వారైతే సరైన శిక్షణ ఇవ్వకుండానే సిబ్బందికి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరిలో పురుషులు 60 శాతం మంది ఉంటే మహిళలు 40 మంది వరకు ఉంటున్నారు. వీరిలో ఎక్కువ వయసు కలిగిన వారూ ఉన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా.. కేవలం మనుషుల కదలికలు మాత్రమే గుర్తించగలుగుతున్నామని.. జూమ్‌ చేసినా అనుమానితుల ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదని విజయవాడ ఘటనపై పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

రోగులకు సాయంగా ఉండేందుకు వచ్చే సహాయకులు, సందర్శకులపై నియంత్రణ ఉండడంలేదు. ఇన్‌పేషంట్‌ల సహాయకులకు విజిటింగ్‌ పాస్‌ ఇస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో పనిచేసే సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఒకరు మాట్లాడుతూ ‘కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా బయటివారు ఇక్కడికి వస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తే.. ఎవరో బంధువు ఆస్పత్రిలో ఉన్నారని, పరామర్శకు వచ్చామని చెబుతున్నారు.’ అని అన్నారు. గతనెలలో విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి ప్రసూతి విభాగంలోకి ఇద్దరు మహిళలు నర్సుల్లా వచ్చి ఓ తల్లిపొత్తిళ్లలో ఉన్న బిడ్డను చికిత్స కోసమంటూ తీసుకువెళ్లి ఎత్తుకుపోయిన ఘటన భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది.  

సిబ్బందినీ పెంచాలి!

ఆస్పత్రుల్లో అవసరాలకు తగ్గట్లు మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, ఫీమెల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ సిబ్బంది ఉండడంలేదు. దీనివల్ల రోగులను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించేందుకు సహాయకులపై ఆధారపడక తప్పడంలేదు. ప్రైవేట్‌ ఏజెన్సీల నేతృత్వంలో పనిచేసే వారు ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో ఉన్నారు. ఇలా గుంటూరు జీజీహెచ్‌లో 500 మంది వరకు ఉంటున్నారు. సెక్యూరిటీ, లాండ్రీ, డైట్, ఫెస్ట్‌ కంట్రోల్, ఇతర పనులకు నియమించే వారి నేపథ్యాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. గుంటూరు జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడున్న 1,267 పడకలు ప్రతిరోజూ రోగులతో నిండుగా ఉంటున్నాయి. వందలమంది వచ్చిపోతుంటారు. అలాంటప్పుడు నిఘా వీలుపడడంలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని