Covid Vaccine: టీకాల మధ్య ఎంత గడువిస్తే అంత సామర్థ్యం

కొవిడ్‌ టీకా రెండు డోసులకూ మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే శరీరంలో యాంటీబాడీలు

Updated : 23 Apr 2022 10:21 IST

లండన్‌: కొవిడ్‌ టీకా రెండు డోసులకూ మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే శరీరంలో యాంటీబాడీలు అంత సమృద్ధి అవుతాయని బ్రిటిష్‌ ఆరోగ్య భద్రతా సంస్థ (యూకేహెచ్‌ఎస్‌ఏ) పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్‌ సోకిన వ్యక్తులకు ఎనిమిది నెలల తరవాత మొదటి డోసు టీకా ఇస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందని తేల్చారు. బ్రిటన్‌ అంతటా 5,871 మంది ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను పరిశీలించిన మీదట ఈ అంశాలను నిగ్గుదేల్చారు. వారందరూ ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాలు తీసుకున్నారు. వారిలో అంతకుముందు కొవిడ్‌ సోకినవారిని ఒక వర్గంగా, అసలు వైరస్‌ సోకనివారిని రెండో వర్గంగా పరిగణించారు. కరోనా వైరస్‌ సోకినవారికి మొదటి టీకా డోసు ఇచ్చాక, వైరస్‌ సోకనివారిలో కన్నా 10 రెట్లు ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. 

రెండో డోసు తరవాత మొదటి వర్గంలో రెండో వర్గంకన్నా రెట్టింపు యాంటీబాడీలు కనిపించాయి. కరోనా వైరస్‌ సోకనివారికి రెండు డోసుల మధ్య ఎక్కువ ఎడం ఉంటే 9 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు వృద్ధి అయ్యాయి. కాబట్టి రెండు డోసుల మధ్య ఎక్కువ వ్యవధి ఇవ్వాలని బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని యూకేహెచ్‌ఎస్‌ఏకి చెందిన యాష్లే ఓటర్‌ అన్నారు. వైరస్‌ సోకిన మూడు నెలల తరవాత మొదటి డోసు టీకా ఇచ్చినప్పుడు ఉత్పన్నమైన యాంటీబాడీలకన్నా, ఎనిమిది నెలల తరవాత డోసు ఇచ్చాక ఉత్పన్నమైన యాంటీబాడీలు ఏడు రెట్లు ఎక్కువ. బూస్టర్‌ డోసులకు ఎంత ఎక్కువ వ్యవధి తీసుకుంటే మంచిదనే అంశాన్నీ శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. స్త్రీలలో, మైనారిటీ జాతుల్లో యాంటీబాడీలు ఎక్కువగా కనిపించాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని