Pakistan: రంజాన్‌ ముగిశాక.. చలో ఇస్లామాబాద్‌!

నిజమైన స్వాతంత్య్ర పోరాటం కోసం భారీ ర్యాలీ నిర్వహణకు అందరూ

Published : 24 Apr 2022 11:17 IST

భారీ ర్యాలీకి ఇమ్రాన్‌ఖాన్‌ బృందం ప్రణాళిక

ఇస్లామాబాద్‌: నిజమైన స్వాతంత్య్ర పోరాటం కోసం భారీ ర్యాలీ నిర్వహణకు అందరూ సిద్ధం కావాలని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి దిగిపోయాక మొదటిసారిగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవాతు తేదీని తర్వాత ప్రకటిస్తానని, అందరూ ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కోరారు. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ ఇస్లామాబాద్‌ వరకు ఉంటుందన్నారు. ప్రధాని పదవి కోల్పోయాక ఇప్పటికే మూడు పెద్ద ర్యాలీల్లో ఇమ్రాన్‌ మాట్లాడారు. పెషావర్, కరాచీ, లాహోర్‌లలో ఈ ర్యాలీలు జరిగాయి. ఇపుడిక దేశ రాజధాని లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించి, సత్వర ఎన్నికలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన భావిస్తున్నారు. బనిగాల నివాసంలో ఇమ్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌ దిశగా జన సముద్రం కదలాలన్నారు. దేశంలో ఏం జరిగింది.. ఏవిధమైన పాలకులు వచ్చారన్నది ప్రజలకు ఇపుడిపుడే అర్థమవుతోందని తెలిపారు. పెద్దసంఖ్యలో నేరస్థులు, బెయిలుపై ఉన్నవారు అధికారంలోకి వచ్చారన్నారు. మే నెల మొదటి వారంతో ముగియనున్న రంజాన్‌ పండుగ తర్వాత ఇస్లామాబాద్‌ ర్యాలీ ఉంటుందని ఇమ్రాన్‌ సన్నిహితులు భావిస్తున్నారు. 

పాక్‌ విదేశాంగ మంత్రిగా బిలావల్‌ భుట్టో!

ఇస్లామాబాద్‌/లండన్‌: పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో (33) దేశ విదేశాంగ మంత్రిగా ఒకట్రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత ఖమర్‌ జమాన్‌ కైరా శనివారం లండన్‌లో మీడియాకు వెల్లడించారు. షెహబాజ్‌ షరీఫ్‌ సంకీర్ణ సర్కారులో పీపీపీ కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ  బిలావల్‌ తొలుత మంత్రివర్గంలో చేరలేదు. గత మంగళవారం జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారం తర్వాత లండన్‌ చేరుకొన్న బిలావల్‌ భుట్టో ఇక్కడే ఉంటున్న పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ వ్యవస్థాపక నేత నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకొని చర్చలు జరిపారు. పాక్‌ రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత కలిసి పనిచేసేందుకు నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని