Published : 19 May 2022 09:36 IST

తల్లడిల్లినతల్లి... ఫలించిన మూడు దశాబ్దాల పోరాటం!

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వేలూర్‌: రాజీవ్‌గాంధీ హత్యకేసులో 19 ఏళ్ల వయసులో పేరరివాళన్‌ అరెస్టయి జైలుకెళ్లారు. మొదట ఉరిశిక్ష పడగా అది యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. దాదాపు 31 ఏళ్లు జైల్లోనే ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో బెయిలు వచ్చింది. బిడ్డను శిక్ష నుంచి బయటపడేసేందుకు, నిర్దోషిగా నిరూపించేందుకు ఆయన తల్లి అర్పుదమ్మాళ్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. తన బిడ్డకు మద్దతు తెలపాలని ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించారు. తమిళనాడు సీఎంలను కలిశారు. కోర్టులోనూ పోరాడారు.  ఆమె కష్టం ఎట్టకేలకు ఫలించింది. ఇది తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరి విజయమని ఆమె పేర్కొన్నారు. 

ఓటమి చవిచూసినా..

కోర్టులో రిట్‌ పిటిషన్లు వేసి పోరాడటంతోపాటు రాజకీయ మద్దతును కూడగట్టేందుకు అర్పుదమ్మాళ్‌ ఎంతో కష్టపడ్డారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిశారు. తర్వాత రాజీవ్‌గాంధీ హంతకుల్లో నలుగురిని విడుదల చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. అందులో పేరరివాళన్‌ పేరు ఉంది. కానీ ఈ తీర్మానంపై గవర్నర్‌ స్పందించలేదు. మరికొందరి సహాయంతో మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడా ఆమెకు ఓటమే ఎదురైంది. తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్లి కలిశారు. జయలలిత అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసినా.. గవర్నర్‌ దగ్గరే అది ఆగిపోయింది.

కష్టాలు చూడలేక...

ఓ పక్క తల్లి నిర్విరామంగా పోరాడుతుండగా.. పేరరివాళన్‌ మూత్రపిండాల సమస్యలకు గురైనట్లు బంధువులు తెలిపారు. అనారోగ్య సమస్యల్ని నివేదిస్తూ.. కనీసం అతడిని పెరోల్‌పై విడుదల చేయాలని, తన కొడుకును కాపాడుకుంటానని పలుమార్లు మద్రాస్‌ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆ తల్లి ఆశ్రయించారు. తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిశారు. అప్పుడాయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, కోర్టుకు ప్రభుత్వం తరఫున సమాధానం ఇప్పించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ ఏడాది మార్చిలో బెయిలుపై ఆయన విడుదలయ్యారు.

వివిధ మాధ్యమాల్లో ఉద్యమం

అర్పుదమ్మాళ్‌ సామాజిక మాధ్యమాలు, వివిధ కార్యక్రమాల్లో తన లక్ష్యం గురించి తరచూ చెప్పేవారు. తన బిడ్డకు మద్దతు తెలపాలని మిస్డ్‌కాల్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దాంతో ప్రజల నుంచి కూడా మద్దతు రాసాగింది. వివిధ పార్టీల ప్రముఖులు కూడా అండగా మాట్లాడారు. 

అమ్మ చలవతోనే బయటకు వచ్చా: పేరరివాళన్‌

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వేలూర్‌: పేరరివాళన్‌కు రాజీవ్‌గాంధీ హత్య కేసు నుంచి విముక్తి లభించిందని తెలియగానే తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సందడి నెలకొంది. చాలామంది ఆయన ఇంటికి తరలివచ్చారు. ఇప్పటికే బెయిలు రావడంతో తీర్పు సమయంలో పేరరివాళన్‌ ఇంట్లోనే కుటుంబంతో ఉన్నారు. ఆయనతోపాటు తల్లి అర్పుదమ్మాళ్, తండ్రి కూయిల్‌నాథన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మీడియాతో పేరరివాళన్‌ మాట్లాడుతూ.. ‘నాకింత మద్దతు వచ్చిందంటే అందుకు కారణం మా అమ్మే. తనవల్లే నేను బయటకు రాగలిగాను. నా కోసం తను 30 ఏళ్లు పోరాడింది. ఆమె ఓడిపోయిన ప్రతిసారీ నేను తనను చూడటానికి భయపడేవాడ్ని. ఆ సమయంలో ఆమె నిరాశ చెందకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అండగా నిలిచారు. తను నా విముక్తిని కోరుకుంది. జైల్లో ఉన్నన్నాళ్లూ.. నేను బతికుండగానే విముక్తి రావాలని ఎంతో ఆశపడ్డాను. అది ఇప్పుడు నెరవేరింది’ అని చెప్పారు. తన విడుదల కోసం కాంచీపురానికి చెందిన 20 ఏళ్ల సెంగొడి అనే యువతి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

జైల్లో ఉండగానే స్వర్ణ పతకం!

ఈనాడు, చెన్నై: పేరరివాళన్‌ జైలులో ఉన్నప్పుడే చదువుకుని స్వర్ణ పతకం సాధించారు. 1971 జులై 30న జోలార్‌పేటలో జన్మించిన పేరరివాళన్‌ కుటుంబం ద్రావిడ ఉద్యమానికి ప్రభావితమైంది. ద్రావిడ ఉద్యమం తెచ్చిన పెరియార్‌కు పెరరివాలన్‌ తల్లిదండ్రులు అనుచరులు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) డిప్లొమా చేసిన పేరరివాళన్‌.. అరెస్టుకు ముందు కంప్యూటర్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. తర్వాత జైలు జీవితం అనుభవిస్తూనే ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంసీఏ చేశారు. ఆ పరీక్షల్లో ఖైదీలందరిలో ఉత్తమ మార్కులు సంపాదించారు. తమిళనాడు ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించిన డిప్లొమా పరీక్షల్లో స్వర్ణ పతకం సాధించారు.  

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts