కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు!

గుజరాత్‌ పాటిదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను వీడిన క్రమంలోనే... ఆ పార్టీకి రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత సునీల్‌ జాఖడ్‌ కాంగ్రెస్‌ను వీడారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు- పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూకు 1988 నాటి రోడ్‌ రేజ్‌ కేసులో సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. 65 ఏళ్ల వ్యక్తిని సిద్ధూ కొట్టడంతో ఆయన చనిపోయినట్టు అప్పట్లో కేసు నమోదైంది.

Updated : 20 May 2022 05:38 IST

భాజపా గూటికి పంజాబ్‌ నేత జాఖడ్‌
1988 నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలుశిక్ష
ఇద్దరూ ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షులే!
‘చింతన్‌ శిబిర్‌’ క్రమంలోనే హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు

చండీగఢ్‌: గుజరాత్‌ పాటిదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను వీడిన క్రమంలోనే... ఆ పార్టీకి రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత సునీల్‌ జాఖడ్‌ కాంగ్రెస్‌ను వీడారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు- పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూకు 1988 నాటి రోడ్‌ రేజ్‌ కేసులో సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. 65 ఏళ్ల వ్యక్తిని సిద్ధూ కొట్టడంతో ఆయన చనిపోయినట్టు అప్పట్లో కేసు నమోదైంది. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ‘చింతన్‌ శిబిర్‌’ నిర్వహించిన క్రమంలోనే వరుసగా దెబ్బలు ఎదురవుతుండటం గమనార్హం. కాంగ్రెస్‌ను వీడిన జాఖడ్‌... ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీపై విరుచుకుపడ్డారు. పార్టీ చిత్రీకరించినట్లుగా ఆయన అంత బలవంతుడేమీ కాదన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ నాయకులు కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో, అధిష్ఠానం ఆయన్ను పదవుల నుంచి తొలగించింది. రాష్ట్రాన్ని కులం, మతం ప్రాతిపదికన కాంగ్రెస్‌ విభజించాలనుకుంటోందని ఆరోపించారు. జాఖడ్‌ ఇప్పుడు లాంఛనంగా భాజపాలో చేరారనీ, ఎప్పట్నుంచో ఆయన ఆ పార్టీకి పనిచేస్తూనే ఉన్నారని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌ రాజా విమర్శించారు.

హరియాణా నేత బిష్ణోయ్‌దీ అదే బాట?

హరియాణాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ కూడా ఆ పార్టీని వీడనున్నారన్న ప్రచారం జోరందుకొంది. హరియాణా పీసీసీలో చోటు దక్కకపోవడంతో ఆయన ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. దీంతో బిష్ణోయ్‌ భాజపా గూటికి చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ కుమారుడైన బిష్ణోయ్‌... ఖట్టర్‌తో తన భేటీ ‘సానుకూలంగా’ జరిగినట్టు ట్విటర్‌లో వెల్లడించారు.

ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడమంటే... స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్టు అర్థం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. చింతన్‌ శిబిర్‌ ముగింపు సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ, జేడీ(ఎస్‌), శివసేన వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు తప్పుగా అర్థం చేసుకున్నాయన్నారు. భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ మాత్రమే పోరాడగలదని రాహుల్‌ అన్నారని, విపక్షాల్లో మరే ఇతర పార్టీకీ జాతీయస్థాయి ఉనికి లేదన్న కారణంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవని ఆయన అన్నట్టు భావించడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని