సార్వత్రిక సోదర స్ఫూర్తితోనే మన భాగస్వామ్యం

సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడిన్స్‌(ఎస్‌వీజీ)తో భారత్‌ భాగస్వామ్యానికి సార్వత్రిక సోదర స్ఫూర్తి ఆధారమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ కరీబియన్‌ ద్వీప దేశంతో భారత్‌కు బలమైన బంధముందని చెప్పారు. సెయింట్‌ విన్సెంట్‌ ప్రధాని రాల్ఫ్‌ గొన్సల్‌వేస్‌తో

Published : 21 May 2022 06:18 IST

ఎస్‌వీజీ ప్రధాని రాల్ఫ్‌తో రాష్ట్రపతి కోవింద్‌
స్థానిక రహదారికి ‘ఇండియా డ్రైవ్‌’గా నామకరణం

కింగ్స్‌టౌన్‌: సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడిన్స్‌(ఎస్‌వీజీ)తో భారత్‌ భాగస్వామ్యానికి సార్వత్రిక సోదర స్ఫూర్తి ఆధారమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ కరీబియన్‌ ద్వీప దేశంతో భారత్‌కు బలమైన బంధముందని చెప్పారు. సెయింట్‌ విన్సెంట్‌ ప్రధాని రాల్ఫ్‌ గొన్సల్‌వేస్‌తో కలిసి కోవింద్‌ స్థానిక ‘కాల్డెర్‌ రోడ్‌’కు ‘ఇండియా డ్రైవ్‌’ అని పేరు పెట్టారు. కరీబియన్‌ ద్వీప సముదాయంలోని రెండు దేశాల పర్యటనలో భాగంగా కోవింద్‌ గురువారం ఎస్‌వీజీకి చేరుకున్నారు. ఆ దేశ గవర్నర్‌ జనరల్‌ డేమ్‌ సుసాన్‌ డౌగన్‌, ప్రధాని గొన్సల్‌వేస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమాచార సాంకేతికత, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఈ దేశాన్ని సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి ఆయన కావడం గమనార్హం. అనంతరం కింగ్స్‌టౌన్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి కోవింద్‌ ప్రసంగించారు. ఆ దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని శ్లాఘించారు. ఇక్కడ సోదర సోదరీమణులకు మద్దతుగా నిలవాలని భారత్‌ కోరుకుంటోందని తెలిపారు. శక్తిమంతమైన ఎస్‌వీజీ నిర్మాణంలో భాగంగా ఇక్కడ మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా భారత్‌, ఎస్‌వీజీల మధ్య పన్నుల వసూళ్ల సమాచార మార్పిడి, సహకారం, పాత కార్టర్‌ కమ్యూనిటీ సెంటర్‌ పునరుద్ధరణకు సంబంధించి రెండు ఒప్పందాలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని