Updated : 22 May 2022 09:21 IST

ఉత్తర కొరియాపై కరోనా పంజా

66 మంది మృతి.. 24 లక్షల మందిలో జ్వరలక్షణాలు
ఉపశమన చర్యలకు ఉపక్రమించిన కిమ్‌
ఇతర దేశాల సాయం కోరడానికీ సిద్ధం..!

సియోల్‌: ఉత్తర కొరియాలో కొవిడ్‌ విరుచుకుపడుతోంది. ప్రపంచంలో కరోనా ప్రారంభమైన రెండేళ్ల తరవాత ఈ దేశంలో తొలి కేసు నమోదవగా.. ప్రస్తుతం ప్రతి రోజూ లక్షల మంది జ్వరపీడితులు అవుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 2.20 లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించామని శనివారం ఆ దేశం వెల్లడించింది. దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కరోనా కట్టడి దిశలో చర్యలను ముమ్మరం చేసినా.. మహమ్మారి పంజా విసురుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే ఆరోగ్య పరిరక్షణ చర్యలు దుర్భరంగా ఉండటంతోపాటు ప్రజలు టీకాలు వేసుకోని కారణంగా దేశంలో కొవిడ్‌ పెనుప్రభావం చూపే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ మీడియా సంస్థ నార్త్‌ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ వివరాల ప్రకారం.. ప్రస్తుతం నిత్యం 2 లక్షల మంది వరకు జ్వరాలబారిన పడుతున్నారు. ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు 24 లక్షల మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించగా.. 66 మంది కొవిడ్‌తో మరణించారు. మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కిమ్‌ ఉపశమన చర్యలకు ఉపక్రమించారు. శనివారం పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించి వైరస్‌ ఉద్ధృతిని తగ్గించాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి మందుల దుకాణాల్లో ఔషధాల కొరతలేకుండా చూడాలని, అంతటా కొవిడ్‌ నిబంధనలను పటిష్ఠంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య సాధనాల కొరత నెలకొన్న నేపథ్యంలో లక్షలాది ఆరోగ్య కార్యకర్తలు.. జ్వరాల బారినపడిన వారిని గుర్తిస్తూ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచుతున్నారు. కరోనా నియంత్రణకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కొవాక్స్‌ అందించే టీకాలను ఉత్తర కొరియా ఇప్పటి వరకు తీసుకోలేదు.

కొవిడ్‌ నియంత్రణలో దేశం బాధ్యతారహితంగా వ్యవహరించిందని, మహమ్మారి కట్టడికి సాయమందిస్తామన్నా స్పందించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌లు కూడా పేర్కొన్నాయి. ఇప్పుడున్న
విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణ కోసం ఇతర దేశాలు, సంస్థల సాయాన్ని పొందడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని