Australia : ఇది ఆస్ట్రేలియాకు పెద్ద మలుపు.. అమ్మ కలగన్న జీవితాన్ని ప్రజలకు అందిస్తా

నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తాను ప్రధానమంత్రిని కాబోతుండడం ఆస్ట్రేలియాకు పెద్ద మలుపు అని లేబర్‌ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు

Updated : 23 May 2022 09:39 IST

నూతన ప్రధాని అల్బనీస్‌ భావోద్వేగం

సిడ్నీ: నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తాను ప్రధానమంత్రిని కాబోతుండడం ఆస్ట్రేలియాకు పెద్ద మలుపు అని లేబర్‌ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలకు చేరువగా వచ్చి, విజేతగా నిలవబోతున్న ఆయన ఆదివారం ఉదయం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తండ్రి అండ లేకపోవడం, వికలాంగులకు ఇచ్చే పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగించడం గురించి గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలు తమ కంటే మెరుగైన జీవితాన్ని సాగించాలని కోరుకుంటారు. నా తల్లి కూడా అలాగే భావించింది. ఆమెతో పాటు ఆస్ట్రేలియా వాసులందరి కలను నెరవేర్చేలా ప్రస్థానం సాగిస్తూ, ఉత్తమ పాలనను అందిస్తా’’ అని చెప్పారు. అల్బనీస్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, స్వతంత్రుల మద్దతు అవసరమవుతుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పోస్టల్‌ ఓట్లు లెక్కించాల్సి ఉండడంతో ఈ అస్పష్టత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. 151 స్థానాలున్న చట్టసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 76 స్థానాలు అవసరం కాగా ఇంతవరకు 71 సీట్లు లేబర్‌ పార్టీకి దక్కాయి. స్కాట్‌ మారిసన్‌ నేతృత్వంలోని సంకీర్ణానికి 52 సీట్లు వచ్చాయి. స్వతంత్రులు, ఇతర పార్టీలవారు 15 చోట్ల గెలిచారు. 67% ఓట్ల లెక్కింపే పూర్తయింది. మంగళవారం టోక్యోలో మొదలయ్యే క్వాడ్‌ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అల్బనీస్‌ సోమవారం తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని