3,5 తరగతుల్లో గద్వాల, 8, 10 తరగతుల్లో హనుమకొండ

చదువులో అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా పేరుపొందిన జోగులాంబ గద్వాల జిల్లా విద్యా సామర్థ్యాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఎనిమిది, పదో తరగతుల్లో హనుమకొండ జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

Published : 27 May 2022 05:56 IST

విద్యా సామర్థ్యాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లాలు
నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో వెల్లడి
జాతీయ సగటు కంటే బాగా వెనకబడిన రాష్ట్రం

ఈనాడు, హైదరాబాద్‌: చదువులో అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా పేరుపొందిన జోగులాంబ గద్వాల జిల్లా విద్యా సామర్థ్యాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఎనిమిది, పదో తరగతుల్లో హనుమకొండ జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు జాతీయ స్థాయితో పోల్చుకుంటే రాష్ట్ర విద్యార్థులు విద్యా సామర్థ్యాల్లో బాగా వెనకంజలో ఉన్నారని స్పష్టమైంది. పదో తరగతిలో మాత్రం జాతీయస్థాయి సగటుకు చేరువగా ఉంది. తాజా నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(న్యాస్‌)-2021లో వెల్లడైన అంశాలివి. తరగతికి తగినట్లు ఆయా సబ్జెక్టుల్లో విద్యా సామర్థ్యాలు ఉన్నాయో, లేవో పరీక్షించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) గత నవంబరు 12న 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులపై సర్వే కోసం దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జిల్లాలవారీగా విద్యా సామర్థ్యాల సగటు స్కోర్‌ను కూడా వెల్లడించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3, 5 తరగతుల్లో జోగులాంబ గద్వాల జిల్లా, 8, 10 తరగతుల్లో హనుమకొండ జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. ‘పదో తరగతి ఆంగ్లం సబ్జెక్టులో మాత్రం జాతీయ సగటు 43 ఉండగా.. రాష్ట్రంలో 48 ఉన్నట్లు తేలింది. సర్వేలో వెల్లడైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ నాగటి నారాయణ కోరారు. దీనిపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు మాట్లాడుతూ నివేదికను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరికొన్ని ముఖ్యాంశాలు...

* 2017 న్యాస్‌ ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి అన్ని తరగతులు, సబ్జెక్టుల్లో విద్యా సామర్థ్యాలు తగ్గినట్లు వెల్లడైంది.

* మూడో తరగతిలో మెదక్‌, 5లో కుమురం భీం ఆసిఫాబాద్‌, 8, 10 తరగతుల్లో ఆదిలాబాద్‌ జిల్లాలు అట్టడుగున నిలిచాయి.

* ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే 77 శాతం ప్రధానోపాధ్యాయులు తమకు తగినంత మంది అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. అవసరమైన గ్రంథాలయం ఉందని 43 శాతం మంది చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు