20కి పైగా దేశాల్లో మంకీపాక్స్‌

ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం తెలిపింది. ఈ వ్యాధిపై కొంత అస్పష్టత ఉన్నప్పటికీ.. మునుపటి ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తితో పోలిస్తే ఇది నియంత్రించగలిగేదేనని పేర్కొంది. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగా అందుబాటులో ఉన్న టీకాలు, ఔషధాలను సమానంగా పంపిణీ చేసేందుకు గాను నిల్వ చేయాలని ప్రతిపాదించింది. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయని, అయితే సంబంధిత వైరస్‌లో జన్యుపరమైన మార్పులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.

Published : 28 May 2022 06:40 IST

ఇది నియంత్రించగలిగే వ్యాధే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
టీకాలు, ఔషధాల నిల్వకు ప్రతిపాదన

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం తెలిపింది. ఈ వ్యాధిపై కొంత అస్పష్టత ఉన్నప్పటికీ.. మునుపటి ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తితో పోలిస్తే ఇది నియంత్రించగలిగేదేనని పేర్కొంది. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగా అందుబాటులో ఉన్న టీకాలు, ఔషధాలను సమానంగా పంపిణీ చేసేందుకు గాను నిల్వ చేయాలని ప్రతిపాదించింది. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయని, అయితే సంబంధిత వైరస్‌లో జన్యుపరమైన మార్పులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.

స్పెయిన్‌లో ఓ మహిళకు మంకీపాక్స్‌

స్పెయిన్‌లో మొత్తం మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 98కి చేరినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఇంతవరకు ఈ వ్యాధి పురుషులకే సోకగా.. తాజాగా ఓ మహిళ దీనిబారిన పడినట్లు వెల్లడించారు. బ్రిటన్‌లో మరో 16 మందికి ఈ వ్యాధి సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 106కి చేరింది. పోర్చుగల్‌లో ఇంతవరకు 76 మంది దీని బారినపడ్డారు. బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, కెనడా, అమెరికాల్లో చాలామేర ఇన్‌ఫెక్షన్లు అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిలోనే బయట పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్‌ సైల్వై బ్రైండ్‌ అభిప్రాయపడ్డారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై బ్రిటన్‌, జర్మనీ, కెనడా, అమెరికాలు పరిశోధన ప్రారంభించిన నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కూడా ఈ విషయమై పనిచేస్తోందని, త్వరలోనే మార్గదర్శకాలను అందిస్తామని చెప్పారు. మంకీపాక్స్‌ ఒకరినొకరు నేరుగా తాకడం (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌) వల్లే వచ్చే అవకాశం ఉన్నందున ఇది అంత సులువుగా వ్యాపించదని, అందువల్ల ప్రజలందరికీ పెద్దఎత్తున టీకాలు వేయాల్సిన అవసరం ఉండదని డబ్ల్యూహెచ్‌వో మశూచి నియంత్రణ విభాగం అధిపతి డాక్టర్‌ రోస్మండ్‌ లూయిస్‌ తెలిపారు. దీనికి గాను ప్రత్యేకంగా టీకాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. మశూచి టీకాలు 85% మేర పనిచేస్తాయని డబ్ల్యూహెచ్‌వో అంచనాకు వచ్చింది. మంకీపాక్స్‌ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లునొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలుంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్నబొబ్బలు ఏర్పడవచ్చు. క్రమేపీ అవి ఇతర శరీర భాగాలకూ వ్యాపించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని