Published : 29 May 2022 05:47 IST

మహిళలను వేధిస్తున్న రుతు చింతన

చిన్న వయసులోనే రుతుమతులు

సర్వేలో వెల్లడి

దిల్లీ: రుతుస్రావ సమయంలో.. బయటకు వెళ్లినప్పుడు బహిరంగ మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తుందన్న చింత, రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టకపోవడం, పొత్తికడుపులో నొప్పులు మహిళలను బాధిస్తాయని స్త్రీల శానిటరీ ఉత్పత్తులను తయారుచేసే ‘ఎవర్‌ టీన్‌’ సంస్థ సర్వేలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను మే 28 ‘ప్రపంచ రుతుస్రావ దినం’ సందర్భంగా ప్రచురించారు. 35 నగరాల్లో 18 - 35 ఏళ్ల వయోవర్గంలోని 6,000 మంది మహిళలు ఈ సర్వేలో అభిప్రాయాలు వెల్లడించారు. ఈ అధ్యయనంలో బయటపడిన మరో కీలక అంశం ఏమిటంటే.. బాలికలు చాలా చిన్నవయసులోనే రుతుమతులు కావడం. సర్వేలో పాల్గొన్నవారిలో 3.2 శాతం మందికి కేవలం ఎనిమిదేళ్ల వయసులో, 4.8 శాతానికి తొమ్మిదేళ్ల వయసులో తొలి రుతుస్రావం జరిగినట్లు తేలింది. 37.5 శాతం మందికి 11 ఏళ్ల వయసులో, మిగతా వారిలో 12 ఏళ్లు.. అంతకంటే కాస్త ఎక్కువ వయసులో తొలి రుతుస్రావం అనుభవమైంది. ఇంత చిన్నవయసులో రుతుమతులు కావడానికి గల కారణాలను శోధించాల్సి ఉంది. ఆఫీసుకు, షాపింగ్‌మాల్‌కు లేదా సినిమా థియేటరుకు వెళ్లినప్పుడు ఎంతో అత్యవసరమైతేనే బహిరంగ మరుగుదొడ్లో శానిటరీ ప్యాడ్‌ను మార్చడానికి వెళతామని 62.2 శాతం మహిళలు చెప్పారు. బహిరంగ టాయిలెట్లో శానిటరీ ప్యాడ్‌ను మార్చుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంటుందని 74.6 శాతం మహిళలు చెప్పారు. అలా మార్చుకుంటే మూత్రకోశ వ్యాధుల ముప్పు ఉంటుందనే భయాన్ని 88.3 శాతం వ్యక్తం చేశారు. నిద్రలో మరకలు అవుతాయన్న ఆందోళన 67.5 శాతం స్త్రీలను వెంటాడుతోంది. దాదాపు 95 శాతం ఏదో ఒకరకంగా బహిష్టు సంబంధ నొప్పికి గురయ్యామని చెప్పారు. బహిరంగ మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలనీ, అందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలని ఈ సర్వే నిర్ధారిస్తున్నట్లు పాన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈవో చిరాగ్‌ పాన్‌ చెప్పారు. సర్వే ఫలితాలు విధానకర్తలకు, పరిశ్రమలకు, పరిశోధకులకు మేలుకొలుపు కావాలన్నారు. భారతీయ మహిళలు ఆధునిక శానిటరీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నా, ఈ విషయంలో మరింత పురోగతి కనబడాలని ఎవర్‌ టీన్‌ సంస్థ సీఈవో హరి ఓం త్యాగి సూచించారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని