Published : 29 May 2022 05:47 IST

భారతరత్న ప్రకటించాలి

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. అఖిల భారత తెలుగు అకాడమీ బెంగళూరు ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని పి.బి.సిద్దార్థ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ‘నయనానందతారక రాముడు’ ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. తొలి కాపీని హుబ్బళ్లి నుంచి వచ్చిన వ్యాపారవేత్త, సామాజిక సేవాతత్పరుడు చిగురుపాటి ప్రసాద్‌కు అందజేశారు. సెంటర్‌ఫర్‌ మీడియా స్టడీస్‌ దిల్లీ సలహాదారు నాగులపల్లి భాస్కరరావు, గారపాటి రామకృష్ణ, అకాడమీ గౌరవాధ్యక్షుడు డి.వి.శేఖర్‌ తదితరులు మాట్లాడారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 14 మందికి నందమూరి తారకరామారావు శత జయంతి పురస్కారాలు, 33 మందికి తెలుగు భాషా పురస్కారాలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రచయితలు, ప్రతినిధులతో కవి సమ్మేళనం నిర్వహించారు. అకాడమీ ప్రధాన కార్యదర్శి కె.రామజోగేశ్వరరావు, కార్యక్రమ నిర్వాహక ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.వి.పూర్ణచందు, ఉపాధ్యక్షుడు పరుచూరి శ్రీనివాసరావు, కార్యక్రమ నిర్వాహక ఆహ్వాన సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు నీలిమా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం ఉద్యమించాలి: ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తెలుగువారంటే మద్రాసీలు కాదని చాటిచెప్పి తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఉద్యమించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ భారతరత్న వచ్చేవరకూ ఈ 365 రోజులూ కోట్ల మెయిళ్లు, మెసేజ్‌ల ద్వారా ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి ఈ విజ్ఞప్తిని తీసుకెళ్లాలి. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్లి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరాలి’ అని సూచించారు. ఎన్టీఆర్‌ పార్టీలకతీతుడని, అందుకే ఆయన ఆశయ సాధన జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని వైకాపా నాయకులు ఫ్లెక్సీలు కట్టారని చెప్పారు. మహానాడుకు వస్తున్న జన ప్రభంజనం ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహానికి నిదర్శనమేమోనని మంత్రులు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రఘురామ సూచించారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని