Published : 23 Jun 2022 05:59 IST

వరద గుప్పిట్లోనే అస్సాం

 క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం హిమంత బిశ్వశర్మ

ఈనాడు, గువాహటి: వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అస్సాంలో ఇంకా పరిస్థితులు భయంకరంగానే ఉన్నాయి. బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల్లో ప్రవాహ స్థాయులు పెరుగుతూ కొత్త ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో సుమారు 55 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు. గత ఏప్రిల్‌ ఆరు నుంచి మంగళవారం వరకు వరదలకు 72 మంది, కొండచరియలు విరిగిపడి 17 మంది... మొత్తం 89 మంది మృతి చెందినట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికారసంస్థ ప్రకటించింది. వరదలకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన నగావ్‌ జిల్లాలోని చపార్‌ముఖ్‌, కామ్‌పుర్‌ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడారు. అన్నివిధాలా ఆదుకోవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గువాహటి నుంచి రైల్వే అధికారులతో కలిసి రైలులో ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలను సందర్శించారు. సీఎం వెంట ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అషుల్‌ గుప్తా, ఇతర అధికారులు ఉన్నారు. మరోపక్క రాష్ట్రంలోని బరాక్‌ లోయ కష్టాలకు అంతులేకుండా పోతోంది. బరాక్‌, దాని ఉప నదులు పలు ప్రాంతాల్లో ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. కచార్‌ జిల్లాలోని బదర్‌పుర్‌ ఘాట్‌ వద్ద బరాక్‌ నది, కరీంగంజ్‌లో దాని ఉపనది ఖుషియారా ప్రమాదస్థాయి దాటి అత్యధిక స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నట్లు కేంద్ర జలసంఘం బుధవారం మధ్యాహ్నం తెలియజేసింది. సిల్చార్‌లోని అన్నపూర్ణ ఘాట్‌ వద్ద బరాక్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. జోర్హాట్‌లోని నిమటిఘాట్‌, సోనిట్‌పుర్‌ జిల్లాలోని తేజ్‌పుర్‌, జిల్లా కేంద్రాలు గోల్‌పరా, దుబ్రిలలో బ్రహ్మపుత్ర, శివసాగర్‌ జిల్లాలోని నంగ్లామురఘాట్‌ వద్ద దిశాంగ్‌ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.


వరదల రాష్ట్రానికి ఆదాయం రావాలిగా!
- శివసేన అసమ్మతి ఎమ్మెల్యేల బసపై హిమంత వ్యాఖ్య

గువాహటి: శివసేన అసమ్మతివర్గ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శాసనసభ్యులు బుధవారం అస్సాం చేరుకోగా.. గువాహటిలోని ఓ పెద్ద హోటలులో వీరు బస చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అస్సాంను ఎవరు సందర్శించినా స్వాగతం పలుకుతా. తరచూ వరదలతో సతమతం అయ్యే రాష్ట్రానికి ఆదాయం కావాలిగా! అస్సాం అంతర్జాతీయ రాజకీయ కేంద్రంగా మారితే నేనింకా సంతోషిస్తా’ అన్నారు. స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిమంత బిశ్వశర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గువాహటిలో పెద్ద పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఆ గదులన్నీ నిండితే వరదల రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. లక్ష్మీదేవిని ఎందుకు వద్దనాలి? ఈ కష్టకాలంలో రాబడి మాకెంతో అవసరం’ అని తెలిపారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని