న్యూ ఇండియాలో దేశ వీరుల మాట వినపడదా?

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ పథకాన్ని విమర్శిస్తూ పరమ్‌వీర్‌ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్‌ బనాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రాహుల్‌... న్యూ ఇండియాలో

Published : 25 Jun 2022 05:51 IST

మోదీపై విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ పథకాన్ని విమర్శిస్తూ పరమ్‌వీర్‌ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్‌ బనాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రాహుల్‌... న్యూ ఇండియాలో కేవలం ‘మిత్రుల’ మాటే తప్ప, దేశ వీరుల మాట వినిపించదా? అని ప్రశ్నించారు. దేశంలో ఒకవైపు మోదీ అహంకారం, నియంతృత్వం ఉంటే... మరోవైపు దేశ ‘పరమ్‌వీర్‌’ ఉన్నారని వ్యాఖ్యానించారు. కెప్టెన్‌ బనా సింగ్‌ చేసిన ట్వీట్‌ను తొలగించడం పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘అగ్నిపథ్‌పై పరమ్‌వీర్‌ చక్ర అవార్డు గ్రహీత ఎంతో నిజాయతీగా, హృదయపూర్వకంగా చేసిన ట్వీట్‌ను తొలగించాల్సి వచ్చింది. మోదీ ఇండియాలో మాట్లాడేందుకే కాదు... మాట్లాడిన అనంతరం కూడా స్వాతంత్య్రం లేకుండా పోయింది’’ అని ఆయన విమర్శించారు. అగ్నిపథ్‌ కార్యక్రమం సైన్యానికి చేటు చేస్తుందని, మాతృభూమి ముద్దుబిడ్డలే దేశ భవిష్యత్తు అని, వారిపై ప్రభావం చూపకుండా దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని కెప్టెన్‌ బనా సింగ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రధానికి లేఖ!

జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాల చుట్టూ కిలోమీటరు పరిధిలో ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జెడ్‌)లను నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో- ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. కోర్టు ఆదేశాల క్రమంలో జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇలాంటి బాధితులు ఉన్నారని, వారు తమ ఇబ్బందులను తన దృష్టికి తెచ్చారని వివరించారు. మోదీకి రాసిన లేఖను రాహుల్‌గాంధీ శుక్రవారం తన ఫేస్‌బుక్‌ పోస్టులో పంచుకున్నారు. ‘‘జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల చుట్టూ కిలోమీటరు పరిధిలో ఈఎస్‌జెడ్‌లను నిర్వహించాలని న్యాయస్థానం చెప్పింది. అయితే, ఈ ఆదేశాలతో ఆయా చోట్ల నివసిస్తున్న వేల కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోంది. ఈఎస్‌జెడ్‌ పరిధిని కొంతమేర తగ్గిస్తే చాలా వరకూ సమస్యను పరిష్కరించే వీలుంటుంది. ఈ దిశగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖతో పాటు... కేంద్ర సాధికార కమిటీ దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లాలి. వాటి సూచనలు, సిఫారసులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి, నిర్వాసితుల సమస్యలను చాలామటుకు పరిష్కరించే అవకాశం ఉంటుంది’’ అని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని