‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022’గా ఖుషీ పటేల్‌

బ్రిటన్‌కు చెందిన బయోమెడికల్‌ విద్యార్థి ఖుషీ పటేల్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ - 2022’ విజేతగా నిలిచారు. భారత్‌ బయట సుదీర్ఘకాలంగా (29 ఏళ్లుగా) ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు.

Published : 26 Jun 2022 05:59 IST

వాషింగ్టన్‌: బ్రిటన్‌కు చెందిన బయోమెడికల్‌ విద్యార్థి ఖుషీ పటేల్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ - 2022’ విజేతగా నిలిచారు. భారత్‌ బయట సుదీర్ఘకాలంగా (29 ఏళ్లుగా) ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు విజేతల వివరాలను నిర్వహణ సంస్థ ‘ఇండియా ఫెస్టివల్‌ కమిటీ (ఐఎఫ్‌సీ)’ శుక్రవారం రాత్రి ప్రకటించింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గాను ఎంపికయ్యారు. పోటీల్లో ముందువరుసలో నిలిచిన 12 మంది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర పోటీల్లో విజేతలైనవారు కావడం విశేషం. ఖుషీ పటేల్‌.. ఓవైపు బయోమెడికల్‌ సైన్సెస్‌, సైకాలజీ కోర్సులు చేస్తూనే మరోవైపు మోడల్‌గానూ రాణిస్తున్నారు. ఆమె సొంతంగా వస్త్రాల దుకాణాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ - 2022’ విజేతగా ఎంపిక కావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తృతీయ ప్రపంచ దేశాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా గయానాకు చెందిన రోషని రజాక్‌ ‘మిస్‌ టీన్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ - 2022’ విజేతగా ఎంపికయ్యారు. నవ్య పైంగొల్‌ (అమెరికా) మొదటి రన్నరప్‌గా, చికితా మలహా (సురినామ్‌) రెండో రన్నరప్‌గా నిలిచారు. ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్న ఐఎఫ్‌సీ కొవిడ్‌ కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు. చివరిసారిగా 2019లో మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ పోటీలు జరిగాయి. కరోనా మహమ్మారి ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని మార్చేసిందని ఐఎఫ్‌సీ ఛైర్మన్‌ ధర్మాత్మ శరణ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని