అంబానీ భద్రతా దస్త్రాల సమర్పణపై సుప్రీం స్టే

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీతో పాటు ఆయన కుటుంబానికి కేంద్రం కల్పిస్తున్న భద్రతా వివరాల దస్త్రాలను సమర్పించాలంటూ త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను బుధవారం సుప్రీంకోర్టు

Published : 30 Jun 2022 06:18 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీతో పాటు ఆయన కుటుంబానికి కేంద్రం కల్పిస్తున్న భద్రతా వివరాల దస్త్రాలను సమర్పించాలంటూ త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను బుధవారం సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జేబీ పర్దీవాలా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌ విచారించే న్యాయపరిధి త్రిపుర హైకోర్టుకు లేదని, వ్యక్తులకు కల్పించే భద్రతా వివరాలు న్యాయసమీక్షకు అతీతమని పేర్కొన్నారు. ఈ నెల 21న త్రిపుర హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్‌, అనంత్‌, ఈశాలకు ఇస్తున్న భద్రతా వివరాలకు సంబంధించిన దస్త్రాన్ని హోంశాఖకు చెందిన అధికారి సీల్డ్‌కవర్‌లో మంగళవారం సమర్పించాలని ఆదేశించింది. ఈ దస్త్రాల్లో అంబానీ కుటుంబానికి ఉన్న భద్రతా ముప్పు వివరాలు, దానిపై అధికారుల మదింపు నివేదికలు ఉండాలని తెలిపింది. దీన్ని సవాల్‌ చేసిన కేంద్రం.. గతంలోనూ ఇలాంటి వ్యాజ్యాన్నే బాంబే హైకోర్టులో వేశారని, దాన్ని న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. త్రిపుర హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన బికాస్‌ సాహాకు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొనే అధికారం లేదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని