Amarnath yatra: మంచుకొండల్లో మహాయాత్ర

హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకు నిలయాలే కాదు.. ఆధ్యాత్మికతకు ఆటపట్టు. మానస సరోవర్‌ నుంచి అమర్‌నాథ్‌, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత

Updated : 01 Jul 2022 10:29 IST

హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకు నిలయాలే కాదు.. ఆధ్యాత్మికతకు ఆటపట్టు. మానస సరోవర్‌ నుంచి అమర్‌నాథ్‌, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నిలయాలు. కశ్మీర్‌కు ఉత్తరాన హిమగిరుల్లో స్వయంభువుగా వెలిసే మంచులింగ దర్శనం కోసం సాగే అమర్‌నాథ్‌ యాత్ర గురువారం మొదలైంది. ఈ ఏడాది జూన్‌ 30 నుంచి ఆగస్టు 11 వరకు అమర్‌నాథ్‌ యాత్ర సాగనుంది.  2019లో ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా యాత్రను కుదించడం, 2020, 2021లో కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ఈ యాత్రను నిలిపివేయడంతో ఈసారి 8 లక్షల మంది వరకు యాత్రికులు రావచ్చని అంచనా. ఇప్పటికే 3 లక్షలమంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 66, జమ్మూకు 176 కిలోమీటర్ల దూరంలో మంచుకొండల నడుమ ఎత్తయిన పర్వత గుహలో వెలిసే మంచులింగ దర్శనం కోసం ఎంతోమంది పయనమవుతుంటారు..


తగిన ఏర్పాట్లతో వెళ్లాల్సిందే..

మంచుపర్వతాల్లో దాదాపు 13,000 అడుగుల ఎత్తున ఉండే అమర్‌నాథ్‌ యాత్రకు సర్వసన్నద్ధంగా వెళ్లాలి. చలి తట్టుకునేలా ఉన్ని దుస్తులు, రెయిన్‌ కోట్‌, అవసరమైన ఔషధాలు వెంట పట్టుకుని వెళ్లాలి.


ఏప్రిల్‌ 11 నుంచి రిజిస్ట్రేషన్లు

ఈ యాత్రకు ఏప్రిల్‌ 11 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఛైర్మన్‌గా ఉండే ‘శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్‌ బోర్డు’ ఈ యాత్రను పర్యవేక్షించడంతోపాటు యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎత్తయిన మంచు కొండల్లో సాగే అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లడానికి తగినంత శారీరక సన్నద్ధత అవసరం. మంచుకొండల నడుమ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవాలంటే తగిన దేహ దారుఢ్యం, ఆరోగ్యం అవసరం.


రెండు మార్గాలు

శ్రీనగర్‌ లేదా జమ్ము నుంచి పహల్గామ్‌ లేదా బాల్తాల్‌ మీదుగా అమర్‌నాథ్‌ గుహకు చేరుకోవచ్చు. పహల్గామ్‌ నుంచి 32 కిలోమీటర్లు, బాల్తాల్‌ వైపు అయితే 14 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.


శ్రీనగర్‌ నుంచి హెలికాప్టర్‌ సర్వీస్‌  

పహల్గామ్‌ లేదా నీల్‌గ్రాత్‌ (బాల్తాల్‌ రూట్‌) నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్‌ సర్వీస్‌ ఉంటుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరం పర్వతాలను ఎక్కుతూ కాలినడకన, గుర్రాలు లేదా డోలీల మీద వెళ్లవచ్చు. ఈ ఏడాది మొదటిసారిగా శ్రీనగర్‌ నుంచి హెలికాప్టర్‌ సర్వీసును ప్రారంభించారు. వీటిని అమర్‌నాథ్‌జీ ష్రైన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు.


పేర్ల నమోదు ఇలా..

* యాత్రికులు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, జమ్మూ కశ్మీర్‌ బ్యాంకు లేదా యెస్‌ బ్యాంకుల్లో నమోదు చేసుకోవాలి.  
* ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కడప, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, సిద్దిపేటలోని బ్యాంకు శాఖల్లో పేర్ల నమోదుకు అవకాశం ఉంది.


స్పాట్‌ రిజిస్ట్రేషన్లు కూడా..

* గుర్తింపు పొందిన ట్రావెల్‌ ఏజెంట్లు కూడా ఈ యాత్రకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంలోనూ పర్మిట్‌, సర్టిఫికెట్‌ అవసరం.
* ముందు అనుకోకుండా యాత్రకు వెళ్లేవారు జమ్మూలోని రైల్వేస్టేషన్‌ వద్ద, శ్రీనగర్‌లోని విమానాశ్రయం తదితర నిర్దేశిత ప్రాంతాల్లో స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని మన ఊరి నుంచే తీసుకెళ్తే సమయం కలిసి వస్తుంది. అక్కడే అన్నీ చేయించుకోవాలంటే కొంత సమయం పడుతుంది.


అమర్‌నాథ్‌ యాత్ర వెబ్‌సైట్‌
www.shriamarnathjishrine.com


నమోదు కేంద్రాలు ఎక్కడ?

* బ్యాంకులో పేర్ల నమోదుకు ముందుగా నిర్దేశిత ఆసుపత్రుల నుంచి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (హెల్త్‌ సర్టిఫికెట్‌) పొందాలి.

* శ్రీఅమర్‌నాథ్‌ జీ ష్రైన్‌ బోర్డు నిర్దేశించిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి.

* ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, అనంతపురంలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందవచ్చు.

* తెలంగాణలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ సదుపాయం ఉంటుంది.

* దరఖాస్తుల కోసం శ్రీఅమర్‌నాథ్‌జీ ష్రైన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ జారీచేసే ఆసుపత్రుల వివరాలు కూడా ఇదే వెబ్‌సైట్‌లో ఉంటాయి.


యాత్ర పర్మిట్‌ పొందడానికి నియమాలు

* ముందు వచ్చినవారికి ముందు అనే పద్ధతిలో యాత్రకు అనుమతిస్తారు. రోజుకు 15,000 మంది యాత్రికులను అనుమతిస్తారు.

* ఒక పర్మిట్‌ ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. బృందాలుగా కూడా నమోదు చేసుకోవచ్చు.

* యాత్ర చేయడానికి పహల్గామ్‌, బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నామో, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకుని చెబితే ఆ మార్గాన్ని అనుసరించి అనుమతి ఇస్తారు.

* 13 సంవత్సరాల లోపు బాలలను, 75 ఏళ్లు దాటిన వృద్ధులను యాత్రకు అనుమతించరు. 6 నెలల గర్భంతో ఉన్న మహిళలకూ అనుమతి ఉండదు. 

* యాత్ర దరఖాస్తు ఫారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* పూర్తిచేసిన దరఖాస్తు, హెల్త్‌ సర్టిఫికెట్‌తో పాటు మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఇవ్వాలి. 

* దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలను అందజేయాలి.

* రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆన్‌లైన్‌ అయితే రూ.160, నేరుగా బ్యాంకులో అయితే రూ.100 చెల్లించాలి. 

* రిజిస్ట్రేషన్‌తోపాటు రూ.5 లక్షల విలువైన బీమా సదుపాయం కల్పిస్తారు.


ఈ ఏడాది ప్రత్యేకతలు..

* యాత్రికులు, గుర్రాల యజమానులు అందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ట్యాగ్స్‌ 

* డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ

* శ్రీనగర్‌ నుంచి నేరుగా పంచతరణి వరకు (అమర్‌నాథ్‌ గుహకు 6 కిలోమీటర్ల దూరం) హెలికాప్టర్‌ సర్వీస్‌

* మొత్తం 80,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు 

* 2019లో 69,770 మంది యాత్రికులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయగా ఈసారి 1,26,570 మందికి సరిపడా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

* యాత్రామార్గంలో 2019లో 3,530 టెంట్లు ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్యను 8,480కి పెంచారు. 

* డీఆర్‌డీవో సహకారంతో చందన్‌వాడిలో 50 పడకల ప్రత్యేక ఆసుపత్రిని, వైద్య సదుపాయాలను ఏర్పాటుచేశారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని