ఐఐటీహెచ్‌లో ‘స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’

ఐఐటీ హైదరాబాద్‌ సిగలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం చేరనుంది. ‘బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ పేరిట ఇది అందుబాటులోకి రానుంది. ఆవిష్కరణలకు ప్రాణం పోయడం, భావి వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడమే

Published : 01 Jul 2022 06:34 IST

 ఏర్పాటు చేయనున్న సైంట్‌, శిబోధి ఫౌండేషన్లు

నిర్మాణ అంచనా వ్యయం రూ.20 కోట్లు

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌ సిగలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం చేరనుంది. ‘బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ పేరిట ఇది అందుబాటులోకి రానుంది. ఆవిష్కరణలకు ప్రాణం పోయడం, భావి వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యాలు. బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి చెందిన సైంట్‌(‘్వi’-్మ్శ, శిబోధి ఫౌండేషన్లు నిర్మాణం, నిర్వహణకు ముందుకొచ్చాయి. ఈ మేరకు మార్చి 2022లో ఈ ఫౌండేషన్లు ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు రూపమిచ్చేలా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రానికి రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీనిని చేపట్టారు. రూ.10కోట్ల భవన నిర్మాణానికి, మరో రూ.10కోట్లను అయిదేళ్ల పాటు నిర్వహణకు ఖర్చు చేయనున్నట్లు ఐఐటీ అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 18నెలల్లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రెండోతరం ఐఐటీల్లో ఇలా సంయుక్త ఆధ్వర్యంలో ఒక కేంద్రాన్ని నిర్మించడం ఇదే మొదటిది. జులై 2న ఐఐటీ ప్రాంగణంలో నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ చాలా కీలకమైనదని సైంట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దేలా..

ఈ కేంద్రంలో ఆవిష్కర్తల కోసం ప్రత్యేక గదులు, సదస్సులు, సమావేశాల నిర్వహణకు మందిరాలు, పరిశోధనలకు అవసరమైన ప్రయోగశాలలుంటాయి. ఆవిష్కరణలతో పాటు భావి వ్యాపారవేత్తలను తీర్చిదిద్దేలా ఇక్కడ కరిక్యులమ్‌ను అభివృద్ధి చేయనున్నారు. సృజనాత్మక మేనేజ్‌మెంట్‌, నాయకత్వం, సంస్థలు, అంకురాలను నెలకొల్పడం తదితర అంశాలకు సంబంధించిన కోర్సులుంటాయి. బీటెక్‌లో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, టెక్నో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ పేరిట, ఎంటెక్‌లో డ్యుయల్‌ డిగ్రీ, ఎంటెక్‌లో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, మేనేజ్‌మెంట్‌తో పాటు బీటెక్‌లోనూ టెక్నో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ చదివేలా కొత్త కోర్సులను అందించనున్నారు. వీటితో పాటు జాతీయ విద్యాపాలసీకి తగినట్లుగా వివిధ రకాల సర్టిఫికెట్‌ కోర్సులూ ఉండనున్నాయి. ‘ఆవిష్కర్త నుంచి వ్యాపారవేత్త’ పేరిట ఒక ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ రకాల పోటీలూ ఈ కేంద్రం వేదికగా నిర్వహించనున్నారు. యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్ది వారి ఆవిష్కర్తలుగా, వ్యాపారవేత్తలుగా మలచేలా ఈ కేంద్రం పనిచేయనుందని ఐఐటీ హైదరాబాద్‌ సంచాలకుడు ఆచార్య బీఎస్‌మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని