ఓటరు జాబితాతో అనుసంధానంలో ఆధార్‌ గోప్యతను పాటించాల్సిందే

ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి నిబంధనలను గట్టిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఆధార్‌ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కారాదని ఎన్నికల అధికారులను హెచ్చరించింది. ఓటర్లు నింపి ఇచ్చే ఫారమ్‌-6బిలోని

Published : 06 Jul 2022 06:04 IST

ఆ సమాచారం లీకైతే కఠినచర్యలు

అధికారులకు ఎన్నికల సంఘం హెచ్చరిక

దిల్లీ: ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి నిబంధనలను గట్టిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఆధార్‌ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కారాదని ఎన్నికల అధికారులను హెచ్చరించింది. ఓటర్లు నింపి ఇచ్చే ఫారమ్‌-6బిలోని సమాచారం లీకైతే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలుంటాయని స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారు(సీఈవో)లకు లేఖలు రాసింది. ఆధార్‌ వివరాల సమర్పణ స్వచ్ఛందమేనని, అందుకోసం ఓటర్లను బలవంత పెట్టరాదని  తెలిపింది. ఆధార్‌ సమాచారం ఇవ్వలేదన్న సాకుతో ఓటరు జాబితా నుంచి సంబంధిత వ్యక్తి పేరును తొలగించడం వంటివి చేయరాదని నొక్కి చెప్పింది. కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం...ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం కోసం పౌరులు ‘ఫారమ్‌-6బి’ని నింపి ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు అందుకు గడువిచ్చింది. ఓటరు ఇచ్చిన ఫారమ్‌-6బిలోని వివరాలు బహిర్గతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదేనని ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ ఓటరు వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సి వస్తే...ఆధార్‌ సంఖ్యను దాని నుంచి తొలగించాలి. లేదంటే కనిపించకుండా చేయాలి. అలాగే ఓటర్లు ఇచ్చే ఫారమ్‌-6బిలను, వాటితో జత చేసిన ప్రతులను డిజిటైజేషన్‌ చేసిన తర్వాత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్వో) సురక్షితంగా భద్రపరచాలి. డిజిటైజేషన్‌ చేసిన 12 అంకెల ఆధార్‌ సంఖ్యను ఈఆర్వోనెట్‌ ఛానళ్లలో కాకుండా ఎన్నికల సంఘం అజమాయిషీలో ఉండే లైసెన్స్‌డ్‌ ఆధార్‌ వాల్ట్‌లో మాత్రమే నిల్వ చేయాలని ఆ లేఖలో ఈసీ విస్పష్టం చేసింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని