Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ కుటుంబానికి భద్రతపై సవాల్‌.. సుప్రీంకోర్టులో విచారణ నేడు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీతోపాటు ఆయన కుటుంబానికి కేంద్రం భద్రత కల్పించడంపై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం వేసిన ఈ

Updated : 28 Jun 2022 09:41 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీతోపాటు ఆయన కుటుంబానికి కేంద్రం భద్రత కల్పించడంపై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం వేసిన ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించనున్నట్లు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి. పార్దీవాలాకు చెందిన సెలవుకాల ధర్మాసనం పేర్కొంది. ముకేశ్‌ కుటుంబానికి ముప్పు ఉందన్న కారణంతో కేంద్రం భద్రత కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ బికాస్‌ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబానీ కుటుంబానికి ముప్పు ఉన్నట్టు నిర్ధారించిన నివేదికకు సంబంధించిన ఫైల్‌ను సమర్పించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఆదేశిస్తూ మే 31, జూన్‌ 21న రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

హోంశాఖ అధికారులు మంగళవారం విచారణకు రావాలని, దీనిపై విచారణ వాయిదా వేసే ప్రసక్తి ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు అంబానీ కుటుంబానికి భద్రత కల్పించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని, అలాంటప్పుడు దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడం హైకోర్టు న్యాయపరిధిలో ఉండదని పేర్కొంది. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు దాన్ని మంగళవారం విచారించనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని